ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో గత 6 దశాబ్దాలకు పైగా కీలక పాత్ర పోషించిన తొలి సూపర్‌సోనిక్ ఫైటర్ జెట్ మిగ్-21 సేవలు శుక్రవారంతో ముగిశాయి. దేశ రక్షణలో అద్వితీయ చరిత్ర సృష్టించిన ఈ ఫ్లయింగ్ కాఫిన్ (ఎగిరే శవపేటిక) స్థానంలో స్వదేశీ టెక్నాలజీతో తయారైన సేవలు అందించనున్నాయి. మొట్టమొదటిసారిగా కమిషన్ చేసిన చండీగఢ్ ఎయిర్ బేస్‌లో మిగ్-21 విమానానికి వీడ్కోలు కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పాంథర్స్ అని పిలిచే స్క్వాడ్రన్ నెంబర్ 23 నుంచి మిగిలిన చివరి బ్యాచ్ జెట్‌లు చివరిసారిగా ఆకాశంలో యుద్ధ విన్యాసాలు ప్రదర్శించాయి. ఈ చారిత్రక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు. రాజ్‌నాథ్‌తో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి వంటి త్రివిధ దళాల అధిపతులు హాజరయ్యారు. ఈ వేడుకల్లో జాగ్వార్, తేజస్ విమానాలు కూడా పాల్గొని తమ విన్యాసాలతో సందడి చేశాయి.సోవియట్ యూనియన్ రూపొందించిన మిగ్-21 ఫైటర్ జెట్.. తొలిసారి 1963లో భారత వాయుసేనలో చేరింది. అప్పట్లో ప్రపంచంలోనే అత్యుత్తమ యుద్ధ విమానంగా ఈ మిగ్-21 ఫైటర్ జెట్లు గుర్తింపు పొందాయి. అనేక కీలక యుద్ధాల్లో ఈ మిగ్-21 యుద్ధ విమానాలు భారత్‌కు విజయాలు అందించాయి. 1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో మిగ్-21 తన పరాక్రమాన్ని చూపెట్టింది. ముఖ్యంగా ఢాకాలోని పాకిస్థాన్ గవర్నర్ భవనంపై బాంబు దాడి చేసి.. యుద్ధ గమనాన్ని మార్చడంలో ఈ ఫైటర్ జెట్ కీలకపాత్ర పోషించింది.ఆ తర్వాత 1999 కార్గిల్ యుద్ధంలో.. ఆ తర్వాత ఇటీవల 2019 జరిగిన బాలకోట్ వైమానిక దాడుల్లోనూ కూడా మిగ్-21 పాల్గొని శత్రుదేశంపై బాంబులు విసిరింది. ఇక బాలాకోట్ ఎయిర్‌స్ట్రైక్స్ సమయంలో స్క్వాడ్రన్ లీడర్ అభినందన్ వర్ధమాన్ తన మిగ్-21 జెట్‌తో పాకిస్తాన్ ఉపయోగించిన అమెరికా అత్యాధునిక ఫైటర్ జెట్‌ ఎఫ్-16ను నేలకూల్చడంతో అనేది భారత ఎయిర్‌ఫోర్స్ చరిత్రలోనే చిరస్మరణీయ ఘట్టంగా నిలిచింది.వేగం, శక్తితో మిగ్-21 పేరు తెచ్చుకున్నప్పటికీ.. ఇందులో ఉన్న సింగిల్ ఇంజిన్ కారణంగా తలెత్తిన సాంకేతిక సమస్యలు.. వాటి భద్రతపై తీవ్ర ఆందోళనలను పెంచాయి. గత 60 ఏళ్లలో 500కి పైగా మిగ్-21 ఫైటర్ జెట్లు కూలిపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రమాదాల్లో సుమారు 170 మంది ఐఏఎఫ్ పైలట్లు ప్రాణాలు కోల్పోవడంతో ఈ విమానాలను దురదృష్టవశాత్తూ ఎగిరే శవపేటికలుగా పిలవడం ప్రారంభించారు. ఈ సుదీర్ఘ చరిత్రకు ముగింపు పలుకుతూ.. సెప్టెంబర్ 26వ తేదీన మిగిలిన చివరి రెండు మిగ్-21 స్క్వాడ్రన్‌లు అధికారికంగా డీకమిషన్ అయ్యాయి.