అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. అవినీతిని అస్సలు క్షమించరు అనే విషయం ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిందే. అవినీతికి పాల్పడే వారు ఎవరైనా సరే కఠిన శిక్షలు విధించేలా అక్కడ కఠినమైన చట్టాలను తీసుకువచ్చారు. అధికారులు, నాయకులు అనే తేడా లేకుండా లంచాలు, అవినీతి చేసే వారికి కఠిన శిక్షలు విధిస్తున్నారు. ఇక తన సొంత పార్టీ నేతలైనా, ప్రభుత్వంలో వ్యక్తులు అయినా.. అవినీతి చేస్తే మాత్రం షీ జిన్‌పింగ్ ఉపేక్షించరు. ఈ క్రమంలోనే అవినీతికి వ్యతిరేకంగా చైనాలో భారీ పోరాటమే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా చైనా మాజీ మంత్రి టాంగ్ రెన్జియాన్‌ అవినీతి కేసులో చాంగ్‌చున్ ఇంటర్మీడియట్ పీపుల్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. గతంలో చైనా వ్యవసాయ, గ్రామీణ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసిన టాంగ్ రెన్జియాన్‌.. 38 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.337 కోట్లు) లంచాలు తీసుకున్నట్లు నేరం రుజువు అయింది. దీంతో కోర్టు ఆయనకు ఉరిశిక్ష విధిస్తూ.. తాజాగా సంచలన తీర్పును ఇచ్చింది. అయితే ఉరిశిక్షను రెండేళ్ల పాటు వాయిదా వేసిన తర్వాత అమలు చేయనున్నారు. ఇక టాంగ్ రెన్జియాన్‌కు ఉన్న మొత్తం వ్యక్తిగత ఆస్తులు జప్తు చేయాలని సంబంధిత అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2012లో చైనా అధ్యక్షుడిగా షీ జిన్‌పింగ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆ దేశంలో అవినీతికి వ్యతిరేకంగా భారీ యుద్ధమే జరుగుతోంది. ఇక ఈ టాంగ్ రెన్జియాన్‌.. చైనాలో అధికార పార్టీ అయిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా మాజీ కార్యదర్శి కావడం గమనార్హం.2007 నుంచి 2024 మధ్య కాలంలో.. వ్యాపార కార్యకలాపాలు, ప్రాజెక్టుల కాంట్రాక్టులు, ఉద్యోగాల నియామకాల్లో ఇతరులకు అక్రమంగా సహాయం చేయడానికి టాంగ్ రెన్జియాన్ తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని.. ఈ క్రమంలోనే మొత్తంగా రూ.337 కోట్ల లంచాలను స్వీకరించినట్లు కోర్టు తేల్చింది. ఈ నేపథ్యంలోనే కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. టాంగ్‌కు రెండేళ్ల వాయిదాతో కూడిన ఉరిశిక్ష విధించారు. ఈ కాలంలో అతని ప్రవర్తన బాగుంటే.. ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ అతడు తన రాజకీయ హక్కులను కోల్పోతాడని తేల్చి చెప్పింది. విచారణ సందర్భంగా కోర్టులో టాంగ్ తన నేరాన్ని అంగీకరించడంతో పాటు.. చివరి ప్రకటనలో పశ్చాత్తాపాన్ని కూడా వ్యక్తం చేశారు.చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ 2012లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా అవినీతిపై రాజీలేని పోరాటాన్ని కొనసాగిస్తోంది. అవినీతికి పాల్పడ్డ 10 లక్షలకు పైగా మంది చైనా అధికారులు, నేతలపై ఇప్పటివరకు కఠిన చర్యలు తీసుకున్నారు. అందులో చాలా మందికి శిక్షలు అమలు చేశారు. ఉన్నత స్థాయిలో ఉన్న మాజీ మంత్రికి మరణశిక్ష విధించడం జిన్‌పింగ్ అవినీతి నిర్మూలన పట్ల ఉన్న కఠిన వైఖరిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది.