పాక్ మంత్రి చేతుల మీదుగా ఆసియా కప్‌ ట్రోఫీ తిరస్కరించిన భారత్.. పహల్గామ్ ఉగ్రదాడి బాధితుడి తండ్రి కీలక వ్యాఖ్యలు

Wait 5 sec.

దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఆసియా కప్‌ ఫైనల్‌లో పాకిస్తాన్‌ను మట్టి కరిపించి కప్ గెలిచిన .. దేశభక్తిని ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఇక కెప్టెన్ తన మ్యాచ్ ఫీజును బాధితులు, సాయుధ దళాల కోసం విరాళంగా ప్రకటించాడు. అంతేకాకుండా.. భారత ఆటగాళ్లు పాక్ మంత్రి మోహసిన్ నఖ్వీ చేతుల మీదుగా ఆసియా కప్ ట్రోఫీని అందుకునేందుకు నిరాకరించారు. దీంతో ట్రోఫీ లేకుండానే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. పహల్గామ్ ఉగ్రదాడిపై తమ ఆగ్రహాన్ని, దేశమే ముఖ్యమని చాటిచెప్పే బలమైన సందేశాన్ని ఇచ్చారని పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ తండ్రి రాజేష్ నర్వాల్ ప్రశంసలు గుప్పించారు.ఫైనల్లో విజయం సాధించిన తర్వాత ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్‌గా ఉన్న మోహసిన్ నఖ్వీ (పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి) చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించడానికి సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా నిరాకరించింది. టోర్నమెంట్ అంతటా పాక్ ఆటగాళ్లతో హ్యాండ్‌ షేక్‌ను కూడా భారత జట్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. ఇక ఏప్రిల్ 22వ తేదీన జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో అమరుడైన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ తండ్రి రాజేష్ నర్వాల్.. టీమిండియా తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించారు. భారత ఆటగాళ్లు, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దేశమే ముఖ్యమని చూపించారని రాజేష్ నర్వాల్ పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి పట్ల కోపంతో ఉన్న టీమిండియా.. పాక్ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్‌ ఇవ్వకపోవడం ద్వారా బలమైన సందేశం పంపిందని తెలిపారు. కొంతమంది పాకిస్తాన్ నాయకులకు, పాక్ సైన్యానికి సందేశం ఇవ్వడం ముఖ్యమని.. అయితే ఆటలను, పాక్ ఆటగాళ్లను ద్వేషించడం తమ ఉద్దేశం కాదని ఈ సందర్భంగా రాజేష్ నర్వాల్ స్పష్టం చేశారు. అయితే ఉగ్రవాదానికి మద్దతిచ్చే పాకిస్తాన్‌తో భారత్ ఆడకూడదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ టోర్నీలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన క్రీడాస్ఫూర్తితో పాటు ఉదార గుణాన్ని చాటుకున్నారు. ఆసియా కప్ టోర్నమెంట్ ద్వారా తాను సంపాదించిన మొత్తం మ్యాచ్ ఫీజును పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు, దేశ సాయుధ దళాలకు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. మీరు ఎల్లప్పుడూ నా ఆలోచనల్లో ఉంటారు. జై హింద్ అని సూర్యకుమార్ యాదవ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. టీ20 ఫార్మాట్‌లో ఒక మ్యాచ్‌కు రూ. 4 లక్షల చొప్పున.. ఈ టోర్నీలో ఆడిన 7 మ్యాచ్‌ల కోసం సూర్యకుమార్ మొత్తం రూ. 28 లక్షలు విరాళంగా అందించనున్నాడు. గతంలో పాకిస్తాన్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్ తర్వాత కూడా సూర్య కుమార్ యాదవ్ ఉగ్రదాడి బాధితులకు నివాళులర్పించగా.. అది రాజకీయ ప్రకటనగా భావించిన పాకిస్తాన్ ఐసీసీకి ఫిర్యాదు చేయడంతో.. సూర్యకుమార్ యాదవ్‌కు జరిమానా విధించింది. అయితే ఆ జరిమానాను బీసీసీఐ సవాల్ చేసింది.