పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పీఓకేలో భారీ తిరుగుబాటు.. రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్న వేలాదిమంది ప్రజలు

Wait 5 sec.

దశాబ్దాల రాజకీయ, ఆర్థిక వివక్షకు వ్యతిరేకంగా (పీఓకే) అట్టుడికిపోతోంది. ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పీఓకేలో భారీ నిరసన జ్వాల ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. అవామీ యాక్షన్ కమిటీ (ఏఏసీ) ఆధ్వర్యంలో సోమవారం చారిత్రక నిరసనలు మొదలయ్యాయి. మొత్తం 38 అంశాలతో కూడిన డిమాండ్లతో ఈ ఉద్యమం ప్రారంభం అయింది. అయితే ఇటీవల బంగ్లాదేశ్, నేపాల్‌ దేశాల్లో చెలరేగిన నిరసనలు.. ఆ దేశ ప్రభుత్వాలనే కూల్చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం అలర్ట్ అయింది. వెంటనే ఈ ఆందోళనలను అణిచివేసే ప్రయత్నాలు చేపట్టింది. భారీ ఎత్తున భద్రతా దళాలను మోహరించి.. ఎక్కడికక్కడ ఈ ఉద్యమాన్ని అణిచివేసేందుకు చర్యలకు దిగింది. ఇక ఈ 38 డిమాండ్లలో కొన్ని ప్రధానమైనవి ఇక్కడ చూద్దాం. పాకిస్తాన్‌లో నివసిస్తున్న కాశ్మీరీ శరణార్థుల కోసం పీఓకే అసెంబ్లీలో ప్రత్యేకంగా రిజర్వ్ చేయబడిన 12 శాసనసభ స్థానాలను తక్షణమే రద్దు చేయాలని నిరసనకారులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ 12 స్థానాలు స్థానిక పాలనను బలహీనపరుస్తున్నాయని స్థానికులు వాదిస్తున్నారు. రెండోది పెరిగిన నిత్యావసర ధరల దృష్ట్యా.. గోధుమ పిండికి సబ్సిడీని పునరుద్ధరించాలి. మూడోది మంగ్లా జలవిద్యుత్ ప్రాజెక్ట్ తమ ప్రాంతంలో ఉన్నప్పటికీ.. స్థానికుల నుంచి అధిక ఛార్జీలు వేస్తున్నారని.. దాని ఉత్పత్తి ధరల ఆధారంగా విద్యుత్ టారిఫ్‌లను తగ్గించాలని డిమాండ్ వినిపిస్తోంది. నాలుగోది.. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల ప్రత్యేక సౌకర్యాలు, వృథా ఖర్చులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. పీఓకేలో చెలరేగిన ఈ ఆందోళనలను అడ్డుకునేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో భద్రతా బలగాలను రంగంలోకి దించింది. పంజాబ్ నుంచి వేలాది మంది సైనికులను రప్పించింది. ఇస్లామాబాద్ నుంచి అదనంగా వెయ్యి మంది పోలీసులను పీఓకేలోని పలు నగరాల్లో మోహరించింది. అంతేకాకుండా ప్రజలను సోషల్ మీడియా ద్వారా సమీకరించకుండా ఉండేందుకు ఆదివారం అర్థరాత్రి నుంచే ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది.ఏఏసీ ప్రతినిధులు.. పీఓకే పరిపాలన, సమాఖ్య మంత్రుల మధ్య 13 గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిగాయి. అయితే ఈ చర్చలు విఫలం కావడంతో.. శరణార్థుల అసెంబ్లీ సీట్లు, ఉన్నత వర్గాల ప్రత్యేక హక్కుల రద్దుపై ఏఏసీ రాజీపడటానికి నిరాకరించడంతో చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. తమ పోరాటం ఏ సంస్థకు వ్యతిరేకంగా కాదని.. 70 ఏళ్లుగా పీఓకే ప్రజలకు దక్కని ప్రాథమిక హక్కుల కోసమని ఏఏసీ నాయకుడు షౌకత్ నవాజ్ మీర్ ముజఫరాబాద్‌లో ప్రజలను ఉద్దేశించి పేర్కొన్నారు. ఇక చాలు.. హక్కులు ఇవ్వండి లేదా ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోండి అంటూ ఆయన తీవ్ర హెచ్చరికలు చేశారు.ఇక పీఓకేలో నెలకొన్న ఆందోళనలకు సంబంధించి సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్ బలవంతపు ఆక్రమణ నుంచి స్వేచ్ఛ కావాలని పీఓకే పౌరులు నినాదాలు చేస్తున్న దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి. ఇరుపక్షాలు వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేకపోవడంతో.. పీఓకేలో ఈ పోరాటం మరింత హింసాత్మకంగా మారే అవకాశం ఉందని అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు.