హైదరాబాద్ శివారులో తక్కువ ధరకే ఇళ్లు.. ఎల్‌ఐజీ, ఎంఐజీ వర్గాల ఇళ్ల స్థలాల సేకరణపై దృష్టి

Wait 5 sec.

పేద, మధ్యతరగతి ప్రజల తెలంగాణ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. హైదరాబాద్ శివారులో ఎల్‌ఐజీ (Low Income Group), ఎంఐజీ(Middle Income Group) వర్గాలకు తక్కువ ధరలకే ఇళ్లను కట్టించి ఇవ్వడానికి ప్రణాళికలు రచిస్తోంది. అందుకు కావాల్సిన స్థలాలపై తాజాగా హౌసింగ్‌ బోర్డు దృష్టిసారించింది. ఈనెల 25 నుంచి ఏప్రిల్‌ 4 వరకు కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ(క్యూర్‌) పరిధిలోని హౌసింగ్‌ బోర్డు, దక్కన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ల్యాండ్‌ హోల్డింగ్స్‌ స్థలాలను గుర్తించి వాటికి రక్షణ గోడలను నిర్మించాలని డిసైడ్ అయింది. ఈ 11 రోజుల్లోనే ఆయా పేద, మధ్యతరగతి ప్రజలకు స్థల సేకరణ, ఇళ్ల నిర్మాణంపై డీపీఆర్‌ తయారీకి ప్రణాళిక రూపొందించనుంది. హౌసింగ్‌ బోర్డుకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ సమస్యల పరిష్కారానికి ఏప్రిల్‌ 5 నుంచి 14 వరకు కేటాయింపుదారులతో కాలనీల వారీగా అధికారులు సమావేశాలను నిర్వహిస్తారు. ఏప్రిల్‌ 15 నుంచి 23 వరకు గ్రీవెన్స్‌ కాల్‌ సెల్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు ప్రభుత్వం ఎఫర్డబుల్‌ హౌసింగ్‌ పాలసీని సిద్ధం చేస్తోంది. ఈ నెలాఖరులోగా మార్గదర్శకాల ముసాయిదాను సర్కార్ రూపొందించనుంది. పాలసీ రూపకల్పనకు 'రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌' ద్వారా ఇప్పటికే సీబీఆర్‌ఐ కన్సల్టెన్సీ సంస్థను సైతం ఎంపిక చేసింది.తెలంగాణ రైజింగ్‌ విజన్‌-2047లో భాగంగా పట్టణ ప్రాంతాల్లో పీపీపీ పద్ధతిలో పేదలు, మధ్యతరగతి వారికి ఇళ్ల నిర్మాణం చేపట్టడానికి సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం మూడు దశల్లో ఈ ఇళ్ల సముదాయాలను నిర్మించనున్నట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ ఫోర్త్ సిటీలోనూ పెద్దఎత్తున గృహ సముదాయాల నిర్మాణాన్ని చేపట్టనుంది. హైదరాబాద్‌‌తోపాటు రాష్ట్రంలోని ఇతర నగరాల్లోనూ తక్కువ ఆదాయ, మధ్య తరగతి పరిధిలోకి వచ్చే జనాభా ఎక్కువగా ఉంటున్నారు. వీరికి కూడా సొంత ఇల్లు కొనుక్కోవాలనే కోరిక ఉన్నప్పటికీ.. అక్కడ కూడా ధరలు భారీగా పెరిగిపోవడంతో అద్దె ఇళ్లలోనే నివాసం ఉంటున్నారు. అందుబాటు ధరలో ఇళ్లు, ఫ్లాట్ల ఉంటే వీరి సొంతింటి కలను నిజం చేసుకోవచ్చు. ఈ మేరకు టైర్ -2 పట్టణాల్లోనూ ఇళ్ల టవర్లను ఏర్పాటుచేసేలా సర్కార్ మార్గదర్శకాలను రెడీ చేస్తోంది. కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, వరంగల్ ఉమ్మడి జిల్లాల పరిధిలో గృహనిర్మాణశాఖ స్థలాలను ఇప్పటికే గుర్తించింది. ఆయా ప్రాంతాల్లో ఇళ్ల సముదాయాలు నిర్మించి అల్ప ఆదాయ, మధ్యతరగతి వారికి తక్కువ ధరలకే అందించాలని సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది.