తెలంగాణలో బీఆర్ఎస్‍తో బీజేపీ పొత్తు.. రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు

Wait 5 sec.

బీఆర్ఎస్‌ పార్టీతో ఎలాంటి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని తెలంగాణ బీజేపీ చీఫ్ త రామచందర్ రావు తేల్చి చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గద్దె దింపాలంటే.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలు కలిసి పోటీ చేస్తాయని వస్తున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య పొత్తులపై వస్తున్న ప్రచారాన్ని రాష్ట్ర ప్రజలు ఎవరూ నమ్మరని స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై స్పందించిన టీబీజేపీ చీఫ్.. భారత్‌లో చమురు కొరత రాదని ధీమా వ్యక్తం చేశారు.హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పలువురు బీఆర్ఎస్ నేతలను కమలం కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన .. ఆసక్తికర వ్యాఖ్యలు చేరారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్‍ పార్టీలకు అధికారాన్ని కట్టబెట్టారని పేర్కొన్నారు. కానీ ఈసారి బీజేపీకి అవకాశం ఇచ్చేందుకు రెడీగా ఉన్నారని తెలిపారు. గతంలో తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ పార్టీ అయినా.. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అయినా.. తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని ఎంఐఎం పార్టీకి ధారాదత్తం చేస్తున్నాయని తీవ్ర విమర్శలు గుప్పించారు.ఇక ప్రస్తుతం ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కలిసి సంయుక్తంగా చేస్తున్న యుద్ధం విషయంలో కాంగ్రెస్ పార్టీ అసత్యాలు చెబుతూ.. దేశంలో ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టిస్తోందని రాంచందర్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని విమర్శించారు. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో తలెత్తిన యుద్ధం కారణంగా.. మన దేశంలో ఎలాంటి చమురు సమస్యలు తలెత్తవని.. భారత్‌కు సరిపడినన్ని చమురు నిల్వలు ఉన్నాయని తేల్చి చెప్పారు. 2014 కంటే ముందు భారత్ కేవలం 16 దేశాల నుంచి మాత్రమే ముడి చమురును కొనుగోలు చేసేదని చెప్పిన రాంచందర్ రావు.. కానీ 2014లో బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే ముందే గ్రహించి.. 47 దేశాల నుంచి చమురు కొనుగోళ్లు చేస్తోందని పేర్కొన్నారు. ఈ దేశాల్లో రష్యా కూడా ఉందని తెలిపారు. అందుకే ఇప్పుడు ఇరాన్‌లో యుద్ధం ఉన్నప్పటికీ మన దేశంలో చమురు కొరత వచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు2005లో అప్పటి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ ఇరాన్‌కు వ్యతిరేకంగా ఐఏఈఏలో ఓటు వేసిన విషయాన్ని గుర్తు చేసిన రాంచందర్ రావు.. ఆ కారణంగానే ఇరాన్ మన దేశానికి క్రూడాయిల్ నిలిపివేసినట్లు తెలిపారు. ఇది అందరికీ తెలిసిన విషయమని.. ఆన్ రికార్డ్ అని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు వీళ్లే మళ్లీ ఇరాన్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారని తీవ్రంగా విమర్శలు గుప్పించారు.