బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ధురంధర్‌’. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది. ఇప్పుడీ సినిమాకి కొనసాగింపుగా పార్ట్-2 రాబోతున్న సంగతి తెలిసిందే. యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ధురంధర్‌ 2’ చిత్రం మార్చి 19న రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా తెలుగు ట్రైలర్ లాంచ్ చేశారు. ''ధైర్యం, శక్తి, ప్రతీకారం..'' అంటూ వచ్చిన ‘ధురంధర్‌ 2’ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. 3 నిమిషాలకు పైగా నిడివితో కట్ చేసిన ఈ వీడియో గూస్ బమ్స్ తెప్పించేలా ఉంది. రెహమాన్ డెకాయిట్ చనిపోయిన తర్వాత లియారిలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనేది చూపించారు. ''ఇకపై పాకిస్తాన్ భవిష్యత్తును భారత్ నిర్ణయిస్తుంది'' అనే డైలాగ్ తో సెకండ్ పార్ట్ కథ ఎలా ఉండబోతోందనేది హింట్ ఇచ్చారు. రణవీర్ సింగ్ పవర్ ఫుల్ యాక్షన్ తో అదరగొట్టారు. ‘ధురంధర్‌ 2’లో జస్కీరత్ సింగ్ (రణవీర్ సింగ్) బ్యాక్ స్టోరీని రివీల్ చేసినట్లు తెలుస్తోంది. అతను హంజా అలీ మజారీ అనే ఇండియన్ స్పైగా ఎలా మారడనేది ఇక్కడ ఆసక్తికరం. ఆర్. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ పాత్రలు రెండో భాగంలో ప్రధానంగా కనిపించనున్నారు. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసిందనే చెప్పాలి. ‘ధురంధర్’ చిత్రాన్ని హిందీలో మాత్రమే రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు ‘ధురంధర్ 2’ సినిమాని హిందీతో పాటుగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. జియో స్టూడియోస్ సమర్పణలో B62 స్టూడియోస్ బ్యానర్ రూపొందిన ఈ చిత్రానికి వికాష్ నౌలాఖా సినిమాటోగ్రఫీ నిర్వహించారు. సాశ్వత్ సచ్‌దేవ్ సంగీతం సమకూర్చారు.