తెలంగాణలో కాలుష్యం తగ్గించేందుకు చేపట్టింది. ఇటీవల రవాణాశాఖపై సమీక్షించిన సీఎం రేవంత్.. ఇకనుంచి ప్రభుత్వం కొనుగోలు చేసే అన్ని వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలే అయి ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఓఆర్‌ఆర్‌ పరిధిలో ఆర్టీసీ విద్యుత్‌ బస్సులే తిప్పుతామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా.. వాయు కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణహిత రవాణా వ్యవస్థను ప్రోత్సహించే దిశగా మరో భారీ ప్రణాళిక రూపొందిస్తోంది. హైదరాబాద్ ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపల ఉన్న తెలంగాణ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ పరిధిలో హరిత ఇంధన వినియోగాన్ని పెంచేందుకు గానూ.. నెట్‌-జీరో కర్బన ఉద్గారాల దిశగా కీలక అడుగులు వేసేందుకు రెడీ అయింది. ప్రస్తుతం కోర్ పరిధిలో 1.26 లక్షల ఆటోరిక్షాలు నడుస్తుండగా.. దశలవారీగా వాటిని ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చడంపై సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసారు. సీఎం ఆదేశాల మేరకు పెట్రోల్, డీజిల్, గ్యాస్‌తో నడుస్తున్న ఆటోలకు ఎలక్ట్రిక్‌ కిట్లు అమర్చేందుకు ప్రత్యేక పాలసీ రూపకల్పన కోసం చర్యలు ప్రారంభమయ్యాయి. ఆటోలకు రెట్రోఫిట్‌మెంట్‌ పాలసీ ఖరారు కోసం ఈనెల 16న సెక్రటేరియట్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. పెట్రోలు, డీజిల్‌ ఆటోలను ఎలక్ట్రిక్‌ కిట్లతో రెట్రోఫిట్‌ చేసేందుకు గాను ఆటో యజమానులకు 100 శాతం ఆర్థిక సహాయం అందించనున్నారు. 2026-27 బడ్జెట్‌లో అందుకు రూ.200 కోట్లు కేటాయించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఆటోడ్రైవర్లపై ఆర్థిక భారం పడకుండా సంక్షేమశాఖల సబ్‌ ప్లాన్‌ల నుంచి నిధులను సబ్సిడీ ద్వారా ఆ డబ్బులు అందించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఆటోలకు ఈ-కిట్లు అమర్చేందుకు సుమారు రూ.1.20 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతుందని అధికారుల అంచనా. ఈ మెుత్తాన్ని సబ్సిడీ ద్వారా అందించనున్నారు. ఆటోలను ఈవీలుగా మార్చటం ద్వారా వాయు, శబ్ద కాలుష్యం తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. ఆటో డ్రైవర్లకూ నిర్వహణ ఖర్చులు తగ్గే ఛాన్సుందని చెబుతున్నారు. కాగా, స్వాపబుల్‌ బ్యాటరీ సిస్టమ్‌ కోసం సుమారు రూ.1.20 లక్షలు, ఫిక్స్‌డ్‌ బ్యాటరీ సిస్టమ్ ఏర్పాటుకు సుమారు రూ.2 లక్షలు ఖర్చవుతాయని అంచనా.