తెలంగాణలోని పలు జిల్లాల్లో నేటి నుంచి మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు

Wait 5 sec.

రాష్ట్రంలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదువుతున్న వేళ.. ప్రచండ భానుడి భగభగల నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభించనుంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఏప్రిల్ 4 నుంచి 6 వరకు మూడు రోజుల పాటు తేలికిపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. శని, ఆది, సోమవారాల్లో ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, సంగారెడ్డి, వరంగల్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్ జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు అంచనా వేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. గంటలకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. మహారాష్ట్ర, కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఓ అల్పపీడన ద్రోణి విస్తరించినట్టు తెలిపింది. అలాగే, దక్షిణ కోస్తాంధ్రలోని యానాం తీరంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని చెప్పింది. వీటి ప్రభావంతో తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక, శుక్రవారం తెలంగాణలోనే అత్యధికంగా ఆదిలాబాద్‌ జిల్లా జైనధ్‌లో 40.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదయ్యింది. తర్వాత నల్గొండ జిల్లా నేరేడుగొమ్ములో 40.1 డిగ్రీలు, ములుగు జిల్లా మంగపేటలో 39.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.ఇక, వాయవ్య భారత్‌లోని పలు ప్రాంతాలపై మధ్యధరా ప్రాంతంలో ఉద్భవించే తుఫానులు తీవ్ర ప్రభావం చూపుతాయని ఐఎండీ అంచనా వేసింది. ఆ ప్రాంతాల్లో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని, కశ్మీర్‌ లోయలో అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. దీని ప్రభావం శని, మంగళవారం గరిష్ఠంగా ఉంటుందని పేర్కొంది. ఏప్రిల్ 7 వరకు మధ్య, దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులలో కూడిన భారీ వానలు పడే అవకాశం ఉందని, ఏప్రిల్ 4న మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో పలు ప్రాంతాల్లో వడగళ్ల వానలకు ఆస్కారం ఉందని ఐఎండీ పేర్కొంది.