గురుకుల, కేజీవీబీ సహా హాస్టల్ విద్యార్థులకు 24 వస్తువులతో కిట్లు.. అందులో ఏముంటాయంటే?

Wait 5 sec.

హాస్టల్స్, కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, గురుకులాలు, మోడల్ స్కూల్స్, గిరిజన పాఠశాలలు సహా ప్రభుత్వ సొసైటీల ద్వారా నిర్వహించే విద్యా సంస్థల్లోని విద్యార్థులకు ఎడ్యుకేషన్‌ కిట్లు అందజేయనుంది. మొత్తం 24 వస్తువులతో కూడిన కిట్లు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇవ్వనున్నారు. దీనివల్ల దాదాపు 5 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. అలాగే, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే డే స్కాలర్‌లకు బూట్లు, సాక్సులు, బెల్టులు ఇవ్వాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల 19 లక్షల మందికి లబ్ది చేకూరుతుందని అధికారులు తెలిపారు. కిట్‌లో యూనిఫామ్ (స్కూల్, వైట్‌ యూనిఫాం), బ్యాగ్, షూ, సాక్సులు, బెల్టు, టై, ఐడీకార్డు హోల్డర్, స్టేషనరీ కిట్, పీటీ డ్రెస్, నైట్‌డ్రెస్, ట్రాక్‌సూట్, కార్పెట్, బెడ్‌షీట్, బ్లాంకెట్, టవల్, ప్లేటు, గ్లాస్, కటోర, కప్పు, స్పూన్, ట్రంకు పెట్టే, నోటు పుస్తకాలు, ట్రాలీబ్యాగ్‌ ఉంటాయి.ఎడ్యుకేషన్ కిట్ల కోసం భారీ ఎత్తున వస్తువుల సమీకరణ కోసం ప్రభుత్వం టెండరు జారీ చేసింది. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమయ్యే సమయానికి వీటిని సిద్ధం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇంటిగ్రేటెడ్ టెండర్లు నిర్వహణకు నోడల్‌ విభాగమైన ఎస్సీ రెసిడెన్సియల్ సొసైటీ ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించింది. ఉన్నతాధికారులతో సమీక్షలు చేపట్టి, ప్రాజెక్టు మోనిటరింగ్ యూనిట్‌ ఏర్పాటు చేసింది. ఈ విభాగం మొత్తం 24 వస్తువులను తొమ్మిది కేటగిరీలుగా విభజించి, ఒక్కోదానికి ప్రత్యేక టెండరు ప్రకటన ఇచ్చింది. ఏప్రిల్ 13 సాయంత్రం 5 గంటల్లోపు కాంట్రాక్టర్లు బిడ్లు దాఖలు చేయాలి. ఈ ప్రక్రియను పకడ్బంధీగా నిర్వహించేందుకు కాంట్రాక్టర్లకు కొన్ని షరతులు విధించారు. టెండర్లు దక్కించుకున్నవారు 45 రోజుల్లోగా అన్ని వస్తువులను సమకూర్చి, జిల్లాలకు పంపాలి. ఒకవేళ జాప్యం జరిగితే ప్రతి 15 రోజులకు 1శాతం చొప్పున జరిమానా విధించనున్నారు. అంతేకాదు, కాంట్రాక్ట్ పొంది, వస్తువులను అందజేయడంలో విఫలమైతే ఏడేళ్లు బ్లాక్‌లిస్టులో పెట్టడం లేదా శాశ్వతంగా టెండర్ ప్రక్రియలో పాల్గొనకుండా నిషేధం విధిస్తామని హెచ్చరించింది. అంతేకాదు, ప్రతి వస్తువుకు ఒక బార్‌కోడ్‌ ఉండాలని స్పష్టంగా చెప్పింది. సంక్షేమ భవన్‌లో ఏప్రిల్ 8న ప్రీబిడ్‌ సమావేశం నిర్వహించి, టెండర్ ప్రక్రియలో లీగల్ వివాదం తలెత్తినా మొత్తం వాటిపై ప్రభావం పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రైవేట్‌ విద్యా సంస్థల తరహాలో బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్ట్‌ ప్రభుత్వం అందించనుంది. ప్రభుత్వ ఎలిమెంటరీ స్కూళ్లో చదువుకునే పిల్లల్లో కనీసం 50 శాతం మంది పాదరక్షలు కూడా వేసుకోవడం లేదు. హైస్కూల్‌లోనూ 5-10 శాతం పిల్లలది అదే పరిస్థితి. ముఖ్యంగా వేరే గ్రామాల నుంచి స్కూళ్లకు నడిచి వచ్చే విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో వారికి ఉపశమనం కలుగుతుంది. ఈ కిట్‌ల పంపిణీ 2026- 27 విద్యా సంవత్సరం నుంచే అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్‌ నికోలస్‌ శుక్రవారం వెల్లడించారు. అయితే గురుకుల విద్యార్థులకు ఇచ్చే కిట్‌లోని వన్తువులన్నీ కేజీబీవీలు, మోడల్‌ స్కూల్‌ హాస్టల్, అర్బన్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల విద్యార్థులకు అందిస్తామని ఆయన తెలిపారు. దీనిపై ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం హర్షం వ్యక్తం చేసింది. తాము 2011 నుంచి పిల్లలకు బూట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నామని, ఇప్పటికి అది కార్యరూపం దాల్చబోతోందని రాష్ట్ర అధ్యక్షుడు జాడి రాజన్న, ప్రధాన కార్యదర్శి చరణ్‌దాస్‌ అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రభుత్వ పాఠశాలలు బలోపేతానికి దోహదం చేస్తాయని, ఇందుకు రేవంత్‌రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు.