ఏపీలో మరో కొత్త క్రికెట్ స్టేడియం రెడీ.. ఈ నెలలోనే ప్రారంభం!

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతిని స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు క్రికెట్ స్టేడియాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. గొల్లవానిగుంటలో తిరుపతి స్మార్ట్‌సిటీ నిధులతో నిర్మించిన క్రికెట్‌ స్టేడియంను శాప్ స్వాధీనం చేసుకుంది. అక్కడ రంజీ మ్యాచ్‌లు నిర్వహించేందుకు వీలుగా స్టేడియంలో చేపట్టిన పనులు ముగింపు దశకు వచ్చాయి. ఈ క్రికెట్‌ స్టేడియం పనులు 90శాతానికిపైగా పూర్తికాగా.. ఈ నెల 15న స్టేడియాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ క్రికెట్ స్టేడియాన్ని శాప్‌ నిధులతో పాటుగా పీ4 విధానంలో దాతల సహకారంతో పనులు చేపట్టారు. క్రికెట్ స్టేడియంలో మొత్తం ఐదు వికెట్‌ టర్ఫ్‌లను 75 చదరపు గజాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నారు. రెండు యాస్ట్రో టర్ఫ్‌లతో పాటుగా ప్రాక్టీస్ కోసం నాలుగు నెట్‌లు, విశాఖ తరహాలో ఎల్‌ఈడీ స్క్రీన్‌లు, స్కోర్‌ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. క్రికెట్ స్టేడియంలోని పెవిలియన్‌ భవనం పనులు ముగింపు దశలో ఉన్నాయి. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో క్రికెటర్ల కోసం వేర్వేరుగా డ్రెస్ మార్చుకునే గదులు, మరుగుదొడ్లు, మ్యాచ్‌లను వీక్షించేందుకు గ్యాలరీలు, ఆఫీస్, రెండో అంతస్తులో వీఐపీలు మ్యాచ్ చూసేందుకు వీలుగా 65 మందికి సరిపడా ప్రత్యేక గ్యాలరీ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ స్టేడియంలో గోడలపై క్రికెట్ ప్లేయర్ల ఫోటోలను వేయిస్తున్నారు. గతంలో తిరుపతిలో క్రికెట్‌ మ్యాచ్‌ల కోసం ఎస్వీయూ తారకరామ గ్రౌండ్ మాత్రమే ఉండేది. అయితే స్టేడియాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో శాప్ ఛైర్మన్ రవి నాయుడు చొరవ తీసుకున్నారు. గొల్లవానిగుంటలో స్మార్ట్‌సిటీ నిధులతో నిర్మించిన ఈ క్రికెట్‌ స్టేడియాన్ని ఆధీనంలోకి తీసుకోవడానికి అధికారుల్ని ఒప్పించారు. ఆ తర్వాత నిధులు విడుదలకాగా పనులు చేపట్టారు. మొత్తానికి ఏపీలో మరో క్రికెట్ స్టేడియం అందుబాటులోకి రానుంది. ఏపీ ప్రభుత్వం క్రీడా మైదానాలు, మౌలిక సదుపాయాలు కల్పించడంపై ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఈ స్టేడియానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్న క్రికెట్ స్టేడియం పనులు కూడా జరుగుతున్నాయి. ఈ పనులు త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.