ఇద్దరు కుమార్తెలను బావిలోకి తోసేసిన తండ్రి.. కరీంనగర్ జిల్లాలో అమానుషం..

Wait 5 sec.

మరోచోట.. మరో ఘోరం.. ఈసారీ సమిధలు చిన్నారులే.. అమ్మకు కోపమొచ్చినా, నాన్నకు ఆవేశం వచ్చినా.. బలి పశువులుగా మారుతోంది కన్న బిడ్డలే. భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న మహిళ ఘటన మరువకముందే తెలంగాణలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్న బిడ్డలను అల్లారుముద్దుగా, కంటికి రెప్పలా కాయాల్సిన తండ్రి.. వారి పాలిట కిరాతకుడిగా మారాడు. నిర్దాక్షిణ్యంగా బావిలోకి తోసి వారి నిండు జీవితాన్ని బలి తీసుకున్నాడు. కరీంనగర్ రూరల్ మండలంలోని జూబ్లీనగర్‌లో ఈ దారుణ, అమానుష ఘటన చోటుచేసుకుంది. కవలలు అయిన కన్న కూతుళ్లను అల్లారుముద్దుగా చూడాల్సిన ఆ తండ్రి.. కర్కశుడిగా మారి, తన చేతులతో వారిని బావిలోకి తోసేశాడు. ఐదేళ్ల వయసు ఉన్న ఇద్దరు పిల్లలను తొలుత బావిలోకి తోసేసిన శ్రీశైలం అనే వ్యక్తి.. తర్వాత తాను కూడా బావిలోకి దూకేశాడు. అయితే దూకిన తర్వాత ప్రాణ భయంతో ఈదుకుంటూ బయటకు వచ్చేశాడు. కానీ పాపం.. ఆ చిన్నారులు తండ్రి క్షణికావేశంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న స్థానికులు.. బావి వద్దకు చేరుకుని గాలించారు. ఒక బాలిక మృతదేహం లభించగా.. మరో చిన్నారి మృతదేహం కోసం గాలిస్తున్నారు. ఇద్దరు కుమార్తెలను బావిలోకి తోసేసిన శ్రీశైలాన్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మరో చిన్నారి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే కుటుంబ కలహాలే శ్రీశైలం ఇలా చేయడానికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.శుక్రవారం ఉదయం భార్యతో శ్రీశైలం గొడవపడినట్లు తెలిసింది. ఈ ఆవేశంలోనే ఇద్దరు కుమార్తెలతో కలిసి బావి వద్దకు చేరుకున్న శ్రీశైలం.. ఆ ఆవేశంలో పసి ప్రాణాలను బలి తీసుకున్నట్లు తెలిసింది. మరోవైపు పిల్లలను గడ్డిమందు తాగించి బావిలోకి తోసేశారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు మరింత సమాచారం అందించాల్సి ఉంది. అయితే ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పిల్లల ప్రాణాలు తీశావంటూ శ్రీశైలాన్ని స్థానికులు చితకబాదారు. ఆ తర్వాత పోలీసులు స్థానికులను అడ్డుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం శ్రీశైలాన్ని పోలీసులు విచారిస్తున్నారు. ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏమిటనే దానిపై ఆరా తీస్తున్నారు.