గోల్డ్ లోన్లకు ఫుల్ డిమాండ్.. ఎంత బంగారానికి లోన్ ఎంతొస్తుందో తెలుసా.. లెక్కలివే!

Wait 5 sec.

: మనలో చాలా మంది ఆర్థిక సమస్యలు సహా ఇతర అవసరాల నిమిత్తం బ్యాంకుల్లో లోన్లు తీసుకునేందుకు చూస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఇక్కడ పర్సనల్ లోన్, హోం లోన్, వెహికిల్ లోన్, ఇలా చాలానే ఉంటాయి. హోం లోన్ అనేది దీర్ఘకాలం చెల్లించాల్సిన లోన్. ఎమర్జెన్సీ అవసరాల కోసం పర్సనల్ లోన్ కోసం చూస్తుంటారు. అయితే ఇది అన్‌సెక్యుర్డ్ లోన్‌గా ఇతర చాలా రకాల రుణాలతో పోలిస్తే గోల్డ్ లోన్ చాలా బెటర్ అని నిపుణులు చెబుతుంటారు. ఇక్కడ వేగంగా డబ్బులు వస్తాయి. ఇక్కడ బంగారం తాకట్టు పెడతాం కాబట్టి.. సెక్యుర్డ్ లోన్‌గా చెబుతారు. . సిబిల్ స్కోరుతో కూడా పని లేదు. మన దేశంలో ప్రతి ఇంట్లోనూ ఎంతో కొంత బంగారం ఉంటుంది. ఎవరి స్థోమతకు తగ్గట్లుగా.. తరచుగా పండగలు, ఇతర శుభకార్యాల సమయంలో కొనుగోలు చేస్తుంటారు. మన దేశంలో ఇళ్లలో బంగారం చూస్తే గత జూన్ చివరి వరకు 34,600 టన్నులకుపైగా ఉందని అంచనా. దీని విలువ రూ. 350 లక్షల కోట్లకుపైగానే ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ బంగారంపై బ్యాంకుల్లో లోన్లు తీసుకునే ధోరణి కూడా ఎప్పటినుంచో కొనసాగుతోంది.ఇక్కడ పూచీకత్తు ఉంటుంది కాబట్టి లోన్ వేగంగా మంజూరవుతుంది. ఇతర అన్ని రకాల లోన్లతో పోలిస్తే గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. గోల్డ్ తాకట్టు పెట్టి తీసుకునే లోన్లను ఎలాంటి అవసరాలకైనా ఉపయోగించుకోవచ్చు. పిల్లల స్కూలు ఫీజులకు.. వ్యాపారాల కోసం.. ఇంకా వైద్య ఖర్చులకు.. కుటుంబ అవసరాల కోసం వాడుకోవచ్చు. తిరిగి చెల్లించే సదుపాయం కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. బంగారం స్వచ్ఛత ఆధారంగా లోన్ వస్తుంది. కనీసం 18 క్యారెట్ల బంగారంపైనే లోన్ వస్తుంది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం 22 క్యారెట్ల బంగారానికి ప్రస్తుతం మార్కెట్ విలువలో 75 నుంచి 85 శాతం వరకు లోన్ పొందొచ్చు. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ. 1.38 లక్షల స్థాయిలో ఉండగా.. తులం గోల్డ్ తాకట్టు పెడితే ఈజీగా రూ. 90 వేల నుంచి లక్ష వరకు లోన్ వస్తుంది. చిన్న లోన్లపై అంటే రూ. 2.5 లక్షల్లోపు రుణాలపై బంగారం విలువలో 85 శాతం వరకు లోన్ వస్తుంది. 5 లక్షల వరకు రుణంపై బంగారం విలువలో 80 శాతం వరకు.. రూ. 5 లక్షలకుపైగా లోన్‌పై అయితే 75 శాతం వరకు లోన్ వస్తుంది.నిర్ణీత కాల వ్యవధిలోపు లోన్ తిరిగి చెల్లించలేకపోతే డిఫాల్ట్ కింద పరిగణించి.. నోటీసు ఇచ్చి గడువు తర్వాత బంగారాన్ని వేలం వేస్తుంటుంది. అందుకే ఇక్కడ ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు లోన్ తిరిగి చెల్లించేందుకు కాస్త ఎక్కువ సమయం ఇచ్చే రుణ సంస్థను ఎంచుకోవడం మంచిది.