‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’: ఎందుకురా ధీరజ్!! ఇంత పెద్ద శిక్ష వేశావ్.. కుమిలి కుమిలి ఏడ్చిన ప్రేమ

Wait 5 sec.

రామరాజు ఇంట్లో జరిగిన శ్రీరామ నవమి వేడుకలో.. ధీరజ్‌కి ఇష్టం లేకపోయినా కూడా.. వేదవతి బలవంతం చేయడంతో ప్రేమతో కలిసి పూజలో కూర్చొంటాడు ధీరజ్. అమూల్య జీవితాన్ని కాపాడటానికే పెళ్లి నాటకం ఆడించాన్రా మగడా అన్నా కూడా ప్రేమని క్షమించడం లేదు ధీరజ్. చివరికి వేదవతికి అన్ని నిజాలు తెలిసి.. అమూల్య-విశ్వక్‌ల మధ్య ప్రేమ రాయబారం చేసింది ప్రేమ కాదురా సన్నాసీ.. శ్రీవల్లి అని చెప్పడం మానేసి. తెలియాల్సినప్పుడు తెలుస్తుంది అంటూ దాటవేసింది వేదవతి. ఇక ఏదో కొంపలు మునిగిపోయినట్టుగా ధీరజ్.. జరిగిన దాన్నే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ప్రేమ వెనకే వచ్చి.. ‘నాతో కలిసి పూజలో కూర్చున్నావ్.. ఇప్పుడు నా మనసు తేలికైంది.. ఇన్నిరోజులు నేను మోసిన బాధ అంతా సంతోషంగా మారింది అంటూ లవ్ బర్డ్స్ ఉన్న గిఫ్ట్‌ని తీసుకుని ధీరజ్ దగ్గరకు ఎగురుకుంటూ వస్తుంది. మరి వీళ్లు ఫ్రేమ్‌లోకి వస్తే చాలు సాంగ్ ఉండాలి కదా.. ఆ కార్యక్రమం కూడా పూర్తౌతుంది. ‘నా రాదారిలో గోదారిలా వచ్చావేమో అంటూ సాంగ్ వేసుకుని ధీరజ్ భుజంపై వాలిపోతుంది ప్రేమ. వదులూ.. చేయి వదులూ.. అని అంటాడు ధీరజ్. ‘నీకోసం ఈ గిఫ్ట్ తీసుకుని వచ్చానురా’ అని అంటుంది ప్రేమ. ‘వదలమని చెప్తున్నా కదా’ అని విసిరికొడతాడు ధీరజ్. ఏంట్రా ఏమైంద్రా? కోప్పడుతున్నావ్ ఏంట్రా..? అని ప్రేమ అడగడంతో ‘నీపై నాకు ఉన్నది అదే’.. అని అంటాడు ధీరజ్. ‘అత్త నీతో మాట్లాడింది కదరా.. కోపం పోయేలా చేసి.. నిన్ను నా పక్కన పూజలో కూర్చోబెట్టింది కదరా’ అని అంటుంది ప్రేమ. ఆ మాటతో ధీరజ్.. ‘మా అమ్మని బాధపెట్టడం ఇష్టం లేక.. మనసుని చంపుకుని వచ్చి నీ పక్కన కూర్చొన్నా.. అంతే తప్ప నిన్ను క్షమించి కాదు.. నా చెల్లెలి విషయంలో నువ్వు చేసిన నమ్మకద్రోహాన్ని జన్మలో మర్చిపోను. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకూ నీపై కోపం పోదు’ అని తెగేసి చెప్తాడు ధీరజ్. రేయ్ ధీరజ్.. నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని ప్రపోజ్ చేసినప్పుడు.. మళ్లీ పెళ్లి చేసుకుంటావా? అని అడిగినప్పుడు.. ఈ ప్రపంచంలో సంతోషం అంతా నాదే అని పొంగిపోయానురా.. కానీ అంతలా ప్రేమించిన మనిషి ఇంతలా ద్వేషిస్తుంటే.. ఆ నరకం భరించలేకపోతున్నారా.. ఎందుకురా నాకు ఇంత పెద్ద శిక్ష వేశావ్’ అని కన్నీటిపర్యంతం అవుతుంది ప్రేమ. దాంతో ధీరజ్.. ‘నా లైఫ్‌లో నేను చేసి తప్పులు ఏంటో తెలుసా.. ఒకటీ నీ మెడలో తాళి కట్టడం.. రెండు నిన్ను ప్రేమించడం.. ఈ రెండూ నన్ను జీవితాంతం వెక్కిరిస్తూనే ఉంటాయి’ అని అంటాడు. ‘రేయ్ ధీరజ్.. ప్లీజ్ రా.. లేనిపోని అపార్థాలతో నీ మనసులోని ప్రేమని ద్వేషంగా మార్చకు.. ఆ ద్వేషంతో మన మధ్య దూరాన్ని పెంచకు’ అని అంటుంది ప్రేమ. ఆ మాటతో ధీరజ్.. ‘నేను కాదు నువ్వే దూరం పెంచావ్.. ప్రేమగా నటిస్తూ నా కుటుంబానికి ద్రోహం చేయాలని చూశావ్.. మీ అన్నకి మా చెల్లెలికి మధ్య ప్రేమ రాయబారం నడిపి నా చెల్లెలి జీవితంతో ఆడుకోవాలని చూశావ్’ అని అంటాడు ధీరజ్. అయితే ప్రేమ మాత్రం.. ‘నేను కాదురా సన్నాసి ఆ పని చేసింది శ్రీవల్లీ’ అని చెప్పకుండా.. అయ్యయ్యో నన్ను అపార్థం చేసుకోకురా అని తాపీగా ఏడుస్తుంటుంది. ‘అమూల్య విషయంలో నాకు ఏ పాపం తెలియదు.. ఇది నా కుటుంబం.. నా కుటుంబానికి నేను ద్రోహం చేయడం ఏంట్రా.. నేను నీతో ప్రేమగా ఉన్నట్టు నటించడం కాదురా.. నా మనసులో నీపై స్వచ్చమైన ప్రేమ ఉందిరా’ అని అంటుంది ప్రేమ. ఆపెహే నీ డ్రామాలు అంటూ దండం పెట్టేస్తాడు ధీరజ్.