చర్చ సందర్భంగా రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ సమన్వయకర్త స్పందించారు. రేణుకా చౌదరి అంత మాటలు అంటే టీడీపీ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. నారా లోకేష్ కూడా ఆమెకు దండం పెట్టారని విమర్శించిన సజ్జల.. మళ్లీ వైసీపీ కులముద్ర వేస్తోందని ఆరోపిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. తాడేపల్లిలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో.. సజ్జల రామకృష్ణారెడ్డి గురించి మాట్లాడారు. ఈ క్రమంలోనే రేణుకా చౌదరి అంశాన్ని ప్రస్తావించారు. "రేణుకా చౌదరికి తొడకొట్టడం అలవాటు. రాజ్యసభలో తొడకొట్టి.. పెట్టరా , పిలవరా కమరావతి అని ఆమె అన్నారు. గతంలోనూ కొండమీద అమ్మవారు.. కింద కమ్మవారు అంటూ రేణుకా చౌదరి వ్యాఖ్యలు చేశారు. పాపం.. కమ్మవారు అందరూ అలాగే అనుకుంటారని నేను అనుకోను. ఇది ఓ కులానికి కాదని వారికి తెలుసు. కానీ చంద్రబాబుకు ఈ ఉద్దేశం ఉందని నేను ఊరికే అనుకోవట్లేదు. రేణుకా చౌదరి అంత మాట అంటుంటే.. ఒక్కడంటే ఒక్కడు కూడా ఖండించలేదు. అదేందమ్మా అలా అంటావ్.. ఇది అందరి రాజధాని కదా అని టీడీపీ నుంచి ఒక్కడు కూడా మాట్లాడలేదు. పైగా నారా లోకేష్ రాజ్యసభ గ్యాలరీ నుంచి ఆమెకు దండం పెడుతున్నాడు. మళ్లీ కులముద్ర వేస్తున్నారంటూ మామీద ఆరోపణలు చేస్తున్నారు." అని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. అమరావతిపై పదే పదే అబద్ధాలు చెప్తూ.. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. సీఎం చంద్రబాబు ఇప్పటికే ఏపీపైన మోయలేని భారం మోపారన్న సజ్జల.. ప్రతిపాదనగా తెలిపారు. 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నచోట రాజధాని ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో అప్పట్లో రాజధానికి మద్దతిచ్చినట్లు సజ్జల తెలిపారు. చంద్రబాబు దిగిపోయే సమయానికి రాజధానిలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. రాజధాని పేరుతో ప్రజల సొమ్మును చంద్రబాబు లాగేస్తున్నారంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రాజధాని నిర్మాణం ఖర్చులు ప్రజలపై పడకూడదనే ఉద్దేశంతోనే వైఎస్ జగన్ ఆలోచనలు చేస్తున్నారన్న సజ్జల.. చంద్రబాబు మాత్రం అమరావతిని దోపిడీ కోసమే వాడుకుంటున్నారని ఆరోపించారు. రాజధాని విషయంలో నేల మీద నిలబడి ఆలోచనలు చేయాలనేదే వైఎస్ జగన్ సిద్ధాంతమని సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు.