తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ డ్రగ్స్ మహమ్మారిని రూపుమాపేందుకు కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన స్పెషల్ ఫోర్స్ ఈగల్.. గత కొన్ని రోజులుగా డ్రగ్స్‌ వినియోగం, పార్టీలపై వరుస దాడులు చేస్తోంది. ఇటీవలె కొండాపూర్‌లో ఓ పబ్‌పై దాడులు చేసిన ఈగల్ టీమ్.. పాజిటివ్ వచ్చిన పలువురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శనివారం మరో రిసార్ట్‌పై దాడులు చేశారు. శనివారం అర్ధరాత్రి గోల్కొండ పరిధిలోని చారిత్రాత్మక తారామతి రిసార్ట్‌లో ఈగల్ టీం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. తారామతి రిసార్ట్‌లో ఏర్పాటు చేసిన జాక్ అండ్ జాన్సన్ అనే హై ప్రొఫైల్ ఈవెంట్‌లో భారీ ఎత్తున డ్రగ్స్‌ను వినియోగిస్తున్నారంటూ.. ఈగల్ టీం అధికారులకు ముందస్తుగా సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే.. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు.. అక్కడికి చేరుకున్నారు. శనివారం కావడంతో ఆ ఈవెంట్‌కు భారీగా యువత తరలివచ్చిందని.. అంతేకాకుండా.. బాలీవుడ్‌కు చెందిన పలువురు నటులు కూడా ఆ పార్టీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇక ఈగల్ టీం అధికారులు డ్రగ్స్ తనిఖీల సమయంలో రిసార్ట్‌ మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనుమానం వచ్చిన వారితోపాటు అక్కడ ఉన్న చాలా మందికి అక్కడికక్కడే డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు. ఇక అత్యంత రహస్యంగా చేపట్టిన ఈ ఆపరేషన్ కోసం ఈగల్ టీం.. హైదరాబాద్ సిటీ టాస్క్‌ఫోర్స్ అధికారుల సహకారం తీసుకున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణ కోసం ఇటీవలే ప్రభుత్వం ఈగల్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసి దాన్ని మరింత బలోపేతం చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌తోపాటు నగరం చుట్టుపక్కల ఉన్న పబ్‌లు, ఫామ్‌హౌస్‌లు, రిసార్టులలో జరిగే డ్రగ్స్ పార్టీలు, రేవ్ పార్టీలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ)ని ఉపయోగిస్తున్నారు. అయితే తాజాగా తారామతి రిసార్ట్‌లో నిర్వహించిన డ్రగ్స్ టెస్టుల్లో ఎంతమందికి పాజిటివ్ వచ్చింది.. ఎవరెవరిని అదుపులోకి తీసుకున్నారు.. అనే వివరాలు ఇంకా బయటికి రాలేదు.