‘పోలీస్ మామలు’ అంటూ మందు బాబుల వాట్సాప్ గ్రూప్.. ఎంట్రీ ఇచ్చిన ఎస్ఐ

Wait 5 sec.

పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కొంతమంది రకరకాల ఎత్తులు వేస్తూ ఉంటారు. రోడ్లపై వాహనాలు ఆపుతుంటే.. గల్లీల నుంచి వెళ్లి.. పోలీసుల నుంచి తప్పించుకుంటారు. అదే సమయంలో అటుగా వచ్చే మిగిలిన వాహనాలకు కూడా ముందు పోలీసులు ఉన్నారని సమాచారం కూడా ఇస్తారు. ఇక సాయంత్రం కాగానే.. ఎక్కడికక్కడ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌లు నిర్వహించి.. మద్యం తాగి వాహనం నడిపే వాహనదారులపై జరిమానాలు, జైలు శిక్షలు రకరకాల ఫైన్లు వేస్తారు. అయితే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులకు చిక్కకుండా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో కొంతమంది మందుబాబులు చేసిన పని ఇప్పుడు రాష్ట్రావ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.గోదావరిఖనిలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌ల నుంచి తప్పించుకునేందుకు కొంతమంది వాహనదారులు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. పట్టణంలో పోలీసులు ఎక్కడెక్కడ మందుబాబుల వాహనాలను ఆపేస్తున్నారు.. ఎక్కడ నిర్వహిస్తున్నారు అనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు అందులో సమాచారం ఇచ్చేవారు. ఆ గ్రూప్‌లో వచ్చిన సమాచారం ఆధారంగా మిగిలిన మందుబాబులు.. ఆ రూట్లలో వెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్తూ.. పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు. అయితే ఇటీవల ఓ మందుబాబు.. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డాడు. అతడి ఫోన్ తీసుకుని చెక్ చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. అందులో ఏకంగా 1024 మంది సభ్యులు ఉండటం గమనార్హం. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌ల నుంచి తప్పించుకునేందుకు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారని ట్రాఫిక్ ఎస్సై గుర్తించారు. ఆ వ్యక్తి ఫోన్‌లో పోలీస్ మామలు అంటూ ఒక వాట్సాప్ గ్రూప్ కనిపించడంతో.. అది ఓపెన్ చేసి చూడగా.. అసలు విషయం బయటికి వచ్చింది. ఈ క్రమంలోనే ట్రాఫిక్ ఎస్సై కూడా తన నంబర్‌ను ఆ గ్రూపులో యాడ్ చేసుకున్నాడు. ట్రాఫిక్ ఎస్సై గ్రూపులోకి రావడంతో.. అందులో ఉన్న మిగతా సభ్యులకు అసలు విషయం అర్థమైంది. వెంటనే ఒక్కొక్కరుగా ఆ గ్రూప్ నుంచి బయటికి వెళ్లిపోవడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ట్రాఫిక్ ఎస్ఐ.. ఆ పోలీస్ మామలు వాట్సాప్ గ్రూప్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఆ గ్రూపులో ఉన్న అందరు వ్యక్తుల నంబర్లను తాను తీసుకున్నానని.. త్వరలోనే వారందరినీ పిలిచి కౌన్సెలింగ్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఇక దీనికి సంబంధించిన వీడియో, ఈ కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఇప్పుడు నెటిజన్ల నుంచి కామెంట్ల వర్షం కురుస్తోంది.