కర్ణాటకలోని రాయచూరు జిల్లా సింధనూరులో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి పర్యటించారు. సింధనూరులో తెలుగువారి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీకృష్ణదేవరాయ విద్యా సంస్థను.. కేంద్ర ప్రభుత్వం సైనిక్ స్కూలుగా మార్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్కూలు ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు సింధనూరు వెళ్లిన మంత్రి నారా లోకేష్.. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి.. రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్‌సేథ్‌తో కలిసి ఆ స్కూల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికంగా కమ్మవారి సంఘం కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ ఎన్టీ రామారావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి.. అక్కడి తెలుగుదేశం పార్టీ అభిమానులను ఉద్దేశించి ప్రసంగించిన నారా లోకేష్ కొంత ఎమోషనల్ అయ్యారు.సింధనూరు ప్రజల రుణం తీర్చుకోవడానికే తాను ఇక్కడికి వచ్చానని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. తన తండ్రి నారా చంద్రబాబు నాయుడును.. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న ప్రభుత్వం.. అక్రమ కేసులు బనాయించి.. రాజమహేంద్రవరం జైల్లో పెట్టిన విషయాన్ని గుర్తు చేసిన నారా లోకేష్.. అప్పుడు సింధనూరు ప్రజలు తమకు అండగా నిలిచారని పేర్కొన్నారు. సింధనూరు నుంచి రాయచూరు వరకు.. గంగావతి, బళ్లారి ఇలా చాలా ప్రాంతాల్లో భారీ ఎత్తున నిరసనలు వ్యక్తం చేసి.. తమకు మద్దతు ప్రకటించిన విషయాన్ని మంత్రి నారా లోకేష్ గుర్తు చేసుకున్నారు. ఆ రుణాన్ని తీర్చుకునే అవకాశం ఈ రోజు వచ్చిందని.. అందులో భాగంగానే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సింధనూరు వచ్చినట్లు లోకేష్ తెలిపారు. అందరి అండ, మద్దతు వల్లే మళ్లీ భారీ మెజారిటీతో గెలిచి అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు అందరిముందు నిలబడ్డామని చెప్పారు. ఇక చాలా ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వచ్చిన ప్రవాసాంధ్రులకు.. కర్ణాటక సొంత తల్లి లాంటిదని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు.ఇక ఈ కార్యక్రమంలో ఇద్దరు కేంద్రమంత్రులతోపాటు మంత్రి నారా లోకేష్, పలువురు కర్ణాటక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొన్నారు. అయితే అక్కడ మంత్రి నారా లోకేష్‌కు ఒక్కడికే ప్రత్యేకంగా కుర్చీ వేశారు. దానికి పక్కనే కేంద్రమంత్రి కుమారస్వామి ఒక సాధారణ కుర్చీలో కూర్చున్నారు. అది గమనించిన మంత్రి నారా లోకేష్ తనకు కూడా సాధారణ కుర్చీ వేయాలని నిర్వాహకులకు సూచించారు. మరోవైపు.. నారా లోకేష్ రాక సందర్భంగా సింధనూరులో భారీగా అభిమానులు, ప్రజలు తరలి వచ్చారు.