ప్రతి సీజన్ ఆరంభంలో అదరగొట్టి.. ఆఖరికి వచ్చేప్పటికి చతికిలపడే ఢిల్లీ.. ఐపీఎల్ 2026ను కూడా ఘనంగానే ఆరంభించింది. ఇకానా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించి తొలి విజయాన్ని నమోదు చేసింది. మిడిలార్డర్ ఆదుకోవడంతో గెలిచిన ఢిల్లీకి ఓపెనింగ్ కాంబినేషన్ మాత్రం కుదర్లేదని ఇర్ఫాన్ పఠాన్ చెప్పాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌కు ఓపెనింగ్ కాంబినేషన్‌లో మార్పులు చేయాలంటూ మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు. కేఎల్ రాహుల్, పాతుమ్ నిస్సాంక లక్నోతో జరిగిన మ్యాచ్‌లో సీజన్‌ను ఆరంభించగా.. ఈ ఇద్దరూ డకౌట్, ఒక్క పరుగుకే పెవిలియన్ బాట పట్టారు. దాంతో ముంబై ఇండియన్స్‌పై పృథ్వీ షాను ఓపెనర్‌గా పంపాలంటూ జట్టు మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. కెరీర్ ఇక ముగిసిపోయింది అనుకున్న సమయంలో దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటిన పృథ్వీ షాని ఐపీఎల్ మినీ వేలంలో ఢిల్లీ తీసుకుంది. విజయ్ హజారే ట్రోఫీలో ఆరు ఇన్నింగ్స్‌లలో 193 పరుగులు, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 7 మ్యాచ్‌లలో 183 పరుగులు చేసి తన ఫామ్‌ని నిరూపించుకున్నాడు. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ అతనిపై నమ్మకం ఉంచి వేలం తర్వాత అతన్ని జట్టులోకి తీసుకుంది. "పృథ్వీ షాను తప్పకుండా జట్టులోకి తీసుకోవాలి. అతను ప్లేయింగ్ 11లో ఉండటం ఢిల్లీకి చాలా ముఖ్యం. ఢిల్లీ మేనేజ్‌మెంట్ నిస్సాంక వైపు మొగ్గు చూపుతున్నా.. నా ఛాయీస్ మాత్రం పృథ్వీ షానే" అంటూ ఇర్ఫాన్ పఠాన్ తన యూట్యూబ్ ఛానల్‌లో అన్నాడు. అదేవిధంగా కేఎల్ రాహుల్‌కు ముంబైపై మ్యాచ్ పెద్ద సవాలుగా మారుతుందని చెప్పాడు. "కేఎల్ రాహుల్ చాలా గొప్ప బ్యాటర్. అయినా ముంబై బౌలింగ్ విభాగం అంతకన్నా బలంగా ఉంది. ముఖ్యంగా బుమ్రా ఎప్పుడూ ట్రంప్ కార్డే. దానికి తోడు ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా, అల్లాహ్ ఘజన్‌ఫర్ లాంటి బౌలర్లను ఎదుర్కోవడం రాహుల్‌కు సవాలుగా మారుతుంది. ముంబై జట్టు రాహుల్‌పై ప్రత్యేక ప్లాన్ చేస్తుంది" అని పఠాన్ పేర్కొన్నాడు.