ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత మరింత పెరిగింది.. రాష్ట్రవ్యాప్తంగా రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలకు తోడు వేడిగాలులు వీస్తుండటంతో జనాలు అల్లాడిపోతున్నారు. ఇవాళ 73 మండలాల్లో తీవ్రవడగాలులు, 17 మండలాల్లో వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఆదివారం 32 మండలాల్లో తీవ్రవడగాలులు, 21 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. శనివారం శ్రీకాకుళం16, విజయనగరం 24, పార్వతీపురం మన్యం15, పోలవరం 9, అల్లూరి సీతారామరాజు 3, అనకాపల్లి 2, కాకినాడ 3, తూర్పుగోదావరి 1 మండలాల్లో తీవ్ర వడగాలులు (73) వీచే అవకాశం ఉందని తెలిపారు. అలాగే శ్రీకాకుళం2, పోలవరం 2, అనకాపల్లి 1, కాకినాడ 2, తూర్పుగోదావరి 3, ఏలూరు 4, ఎన్టీఆర్ 1, పల్నాడు 2 మండలాల్లో వడగాలులు (17) ప్రభావం చూపనున్నట్లు తెలిపారు. ఎండ తీవ్రత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కూడా రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. ఏపీలో శుక్రవారం రోజు ఏకంగా 11 జిల్లాల్లో 40 డీగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లా భామినిలో 41.8 డిగ్రీలు. చిత్తూరు జిల్లా రాయలపేటలో 41.4 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా నాతవరంలో 40.9 డిగ్రీలు, శ్రీకాకుళం జిల్లా జి. సిగడాంలో 40.5 డిగ్రీలు, నంద్యాల జిల్లా ఆలమూరుతో పాటుగా కడప జిల్లా బద్వేల్‌లో 40.4 డిగ్రీలు.. ఏలూరు జిల్లా ధర్మాజీగూడెంతో పాటుగా తిరుపతి జిల్లా రేణిగుంట, విజయనగరం జిల్లా రాజాంలో 40.3 డిగ్రీలు, కృష్ణా జిల్లా కంకిపాడులో 40.1 డిగ్రీలు, కర్నూలు జిల్లా తోవిలో 40 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలు ఎండ, వేడిగాలుల తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.ఓవైపు ఏపీలో సూర్యుడు భగ్గుమంటుంటే.. అటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. అల్లూరి సీతారామరాజు, పోలవరం, పార్వతీపురం మన్యం, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి జల్లులు పడొచ్చని హెచ్చరించారు. అయితే పలుచోట్ల వానలు కురిశాయి. ఓ వైపు ఎండల తీవ్రత కనిపిస్తుంటే.. మరోవైపు వర్షాలు పడ్డాయి.