ఏపీలో వరుసగా నేషనల్ హైవేలు, స్టేట్ హైవేలను విస్తరిస్తున్నారు.. తాజాగా మరో నేషనల్ హైవే విస్తరణకు సంబంధించి ముందడుగు పడింది. పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని జాతీయ రహదారి-216 నుంచి భీమవరం పట్టణం మీదుగా పిప్పర వరకు రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ చొరవ తీసుకుని ఈ రోడ్డు కోసం 2024లో సీఆర్‌ఎఫ్‌ నిధులు రూ.99 కోట్లు మంజూరు చేయించారు. అయితే ఆ తర్వాత ఈ రోడ్డు పనులు ప్రారంభం కాలేదు. తాజాగా కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ భీమవరంలో ఈ రోడ్డుకు సంబంధించిన సమావేశం నిర్వహించారు. మొదటి ప్యాకేజీ పనులకు రాష్ట్ర రహదారి, భవనాలశాఖ స్పెషల్ సెక్రటరీ కృష్ణబాబుతో మాట్లాడారు. ఈ రోడ్డు మొదటి ప్యాకేజీ పనులకు పరిపాలనా అనుమతులు ఇవ్వాలని కోరగా.. సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అన్ని కుదిరితే ఈ నెలాఖరు నుంచి ఈ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించే అకాశం ఉంది.మూడు ప్యాకుజీలుగ ఈ రోడ్డును విస్తరించాలని ప్లాన్ చేశారు.. 17 నెలల క్రితం ఈ రోడ్డు కోసం సీఆర్‌ఎఫ్‌ నిధులు రూ.99 కోట్లు మంజూరయ్యాయి. మొదటి ప్యాకజీ కింద భీమవరం నుంచి లోసరి దగ్గర బర్రెవానిపేట వరకు 15 కిలోమీటర్ల రోడ్డును రూ.43 కోట్లతో విస్తరించనున్నారు. రెండో ప్యాకేజీ కింద భీమవరం పట్టణం నుంచి గొల్లలకోడేరు వరకు.. అలాగే ప్రస్తుతం ఉండి రోడ్డు జంక్షన్ నుంచి కుముదవల్లి వరకు ఉన్న బైపాస్‌ను రూ.31.40 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. మూడో ప్యాకేజీ కింద 7.8 కి.మీ దూరాన్ని రూ.25 కోట్లతో గొల్లలకోడేరు నుంచి యండగండి మీదుగా పిప్పర వైపు విస్తరించనున్నారు. అయితే ప్రస్తుతానికి మొదటి ప్యాకేజీకి మాత్రం గ్రీన్‌‌సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది.ప్రతి రోజూ భీమవరం నుంచి తాడేపల్లిగూడెం వైపు రోజుకు 22 వేల వరకు, లోసరివైపు 24వేల వరకు వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే ఈ రోడ్డు పరిస్థితి దారుణంగా మారింది.. దీంతో జనాలు ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. అలాగే ఈ రోడ్డు మీదుగా వెళ్లే వాహనాలకు సరకుల ఎగుమతి (ఆక్వా, వ్యవసాయ ఉత్పత్తుల తరలింపునకు ఇబ్బందులు) కష్టంగా మారింది. అందుకే వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని భావిస్తున్నారు. ముందు మొదటి ప్యాకేజీ పనులు ప్రారంభించనున్నారు.