ఆలయాల్లో పూజలకు సంబంధించి.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలు ఇప్పుడు కీలకంగా మారాయి. అర్చకులు, వారు చేసే పూజలు, నిబంధనలకు సంబంధించి రాష్ట్ర దేవాదాయ శాఖ సర్క్యులర్ (ధార్మిక పరిషత్), శృంగేరి శారదా పీఠం ఇచ్చిన మార్గదర్శకాలను అమలు చేయాలని.. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, దేవాదాయ శాఖ కమిషనర్‌లకు తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇతర దేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు.. దేవస్థానాల ప్రధాన గర్భాలయాల్లోకి ప్రవేశించి.. పూజలు చేసేందుకు వీలు లేదంటూ ఉన్న మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు జరిగేలా చూడాలని ధర్మాసనం తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి జడ్జి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మార్చి 30వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. దేవాలయాల్లో అర్చకుల పూజల విషయంలో 2010 నవంబరు 10వ తేదీన దేవాదాయ శాఖ జారీ చేసిన సర్క్యులర్.. 2024 డిసెంబరు 20వ తేదీన శృంగేరి శారదా పీఠం జగద్గురువులు మహాతీర్థ భారతీస్వామి రిలీజ్ చేసిన ప్రామాణికను పూర్తి స్థాయిలో అమలు పరచడం లేదంటూ విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన శ్రీచక్ర నవావరణ అర్చన పారాయణదారు డీఎస్‌ఎస్‌ఎస్‌ సుబ్రహ్మణ్యం సోమయాజి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.పిటిషనర్‌ డీఎస్‌ఎస్‌ఎస్‌ సుబ్రహ్మణ్యం సోమయాజి తరఫున వాదనలు వినిపించిన లాయర్ కేఆర్‌ శ్రీనివాస్‌.. విదేశాలకు వెళ్లి వచ్చిన పూజారులు.. రూల్స్‌ను అతిక్రమించి ఆయా ఆలయాల్లోని ప్రధాన గర్భాలయాల్లో పూజలు చేసేందుకు అనుమతులు ఇస్తున్నారని వాదించారు. శారదాపీఠం ప్రామాణిక, ధార్మిక పరిషత్‌ సర్క్యులర్ ప్రకారం అసలు విదేశాలకు వెళ్లేందుకే అర్చకులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అలా కాదని.. ఎవరైనా విదేశాలకు తప్పకుండా వెళ్లాల్సి వస్తే.. వారికి అనుమతి ఇవ్వవచ్చని పేర్కొంటూనే.. వారు తిరిగి విదేశాల నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత వారిని గర్భగుడుల్లో పూజలు చేసేందుకు అనుమతించరని గుర్తు చేశారు. అలాంటి అర్చకులకు కేవలం ఆలయాలకు బయట జరిగే పూజలు, వ్రతాలకు మాత్రమే అనుమతి ఉంటుందని పిటిషనర్ తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. భారతీస్వామి ప్రామాణిక ప్రకారం.. నిత్యం త్రికాల సంధ్యావందనం, వేద అధ్యయనం, గురు ఉపదేశ మంత్ర జపం, కఠిన ఆధ్యాత్మిక క్రమశిక్షణ. ఆహార నియమాలు పాటించిన వారు మాత్రమే గర్భాలయాల్లో పూజలు చేసేందుకు అర్హులు అని తేల్చి చెప్పారు. విదేశాలకు వెళ్లినవారు.. మన సంప్రదాయాలకు భిన్నంగా క్షవరం, జుట్టు కత్తిరించుకున్న వారు గర్భాలయంలో పూజలు చేయడానికి వీలు లేదని ప్రామాణిక చెబుతోందని వెల్లడించారు. దీనిపై స్పందించిన రాష్ట్ర దేవాదాయ శాఖ తరఫు లాయర్.. దేవాదాయ శాఖ సర్క్యులర్, శారదా పీఠం ప్రామాణికలను అనుసరించి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టుకు విన్నవించారు.