ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధతపై బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఈ బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దగ్గరకు చేరింది.. అక్కడ రాష్ట్రపతి సంతకం పూర్తికాగానే గెజిట్‌గా మారనుంది. అమరావతి బిల్లు ప్రక్రియ ఓవైపు కొనసాగుతుంటే.. ఇటు అమరావతికి త్వరలోనే కొత్త పిన్ కోడ్ కూడా రానున్నట్లు తెలుస్తోంది. తపాలాశాఖ త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే భారత తపాలా శాఖ ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతిగా అధికారికంగా గుర్తింపు దక్కుతుందని భావిస్తున్నారు. అడ్వకేట్, సామాజిక కార్యకర్త రమేష్ చంద్ర వర్మ అమరావతికి కొత్త పిన్‌కోడ్‌తో పాటుగా ఆధార్, పాస్‌పోర్ట్ సేవలు ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలుస్తోంది. అమరావతికి కొత్త పిన్ కోడ్ ఎప్పుడు వస్తుందని.. రాజధానిలో జనరల్ పోస్ట్ ఆఫీస్ నిర్మాణం ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు. ఆయన సూచనలపై తపాలా శాఖ స్పందించి.. అమరావతిలో జనరల్ పోస్ట్ ఆఫీస్ (GPO) నిర్మాణానికి ఇప్పటికే భూమిని సేకరించిన విషయాన్ని తెలిపింది. ఈ జీపీవో నిర్మాణం పూర్తయిన వెంటనే సర్కిల్ కార్యాలయ అనుమతితో కొత్త పిన్ కోడ్‌ను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. పిన్‌కోడ్, ఆధార్, పాస్‌పోర్ట్ సేవలపై ఉమేష్ చంద్ర సూచనల్ని పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ సేవలు ప్రారంభమయ్యే వరకు ప్రస్తుతం ఉన్న సబ్-ఆఫీసుల ద్వారా ఈ సేవలు కొనసాగుతాయని తెలిపినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన (సవరణ) బిల్లు - 2026కు పార్లెమెంట్‌లో ఆమోదం తర్వాత ఇది కీలక అడుగు అని అడ్వకేట్ రమేశ్ చంద్ర వర్మ చెబుతున్నారు.అమరావతిలో పోస్టాఫీస్ మాత్రమే కాదు.. పలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఏర్పాటు కాబోతున్నాయి.. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం స్థలాలను కేటాయించారు. అయితే గతేడాది అమరావతిలో పలు బ్యాంకుల ఏర్పాటు దిశగా తొలి అడుగు పడింది. బ్యాంకుల ఏర్పాటుకు సంబంధించి శంకుస్థాపన నిర్వహించారు.. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మొత్తం మీద అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయి.