గుజరాత్ టైటాన్స్ - రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఐపీఎల్ అసలైన మజాని ఇచ్చింది. అప్పటి వరకు గుజరాత్ వైపు ఉన్న మ్యాచ్.. ఒక్కసారిగా రాజస్థాన్ చేతుల్లోకి వెళ్లింది. హార్డ్ హిట్టర్ రషీద్ ఖాన్ క్రీజులో ఉన్నప్పటికీ రెండు ఓవర్లలో 14 పరుగులు చేయలేక గుజరాత్ టైటాన్స్ ఓడిపోయింది. అసలైన ఐపీఎల్ సినిమా అంటే ఏంటో జోఫ్రా ఆర్చర్, చూయించారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. యశస్వి జైస్వాల్ 55, ధృవ్ జురేల్ 75 పరుగులు చేయడంతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. భారీ టార్గెట్ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఓపెనర్లు సాయి సుదర్శన్, కుమార్ కుశాగ్ర అద్భుత ఆరంభం ఇచ్చారు. మిడిలార్డర్ విఫలమైనా ఆఖర్లో రషీద్ ఖాన్, కగిసో రబాడా బౌండరీలు బాదడంతో మ్యాచ్ గుజరాత్ టైటాన్స్‌దే అని అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే, ఆఖరి రెండు ఓవర్లలో సీన్ రివర్స్ అయింది. కేవలం 14 పరుగులు చేయలేక గుజరాత్ టైటాన్స్ ఓడిపోయింది. అందులోనూ రెండు ఓవర్లలో కేవలం 8 పరుగులే ఇచ్చి రాజస్థాన్ బౌలింగ్ సత్తా ఏంటో చూయించింది. 18 ఓవర్లు ముగిసే సమయానికి గుజరాత్ టైటాన్స్ జట్టు 196/7తో ఉంది. ఆఖరి రెండు ఓవర్లలో గుజరాత్ గెలుపునకు 14 పరుగులే కావాల్సి వచ్చింది. క్రీజులో 11 బంతుల్లో 21 పరుగులు చేసిన రషీద్ ఖాన్, 10 బంతుల్లో 20 పరుగులు చేసిన కగిసో రబడా ఉన్నారు. అయితే 19వ ఓవర్‌లో జోఫ్రా ఆర్చర్ అద్భుత యార్కర్లతో పరుగులను కట్టడి చేశాడు. ఆ ఓవర్‌లో కేవలం నాలుగు పరుగులే ఇవ్వడంతో ఒక్కసారిగా టెన్షన్ వాతారణం నెలకొంది. ఆఖరి ఓవర్‌కి 11 పరుగులు కావాల్సి రావడంతో కెప్టెన్ రియాన్ పరాగ్ తుషార్ దేశ్‌పాండేకి బౌలింగ్ ఇచ్చాడు. తొలి బంతే వైడ్‌ అవడంతో గుజరాత్ గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ వరుసగా మూడు సింగిల్స్ ఇవ్వడం, నాలుగో బంతిని డాట్ చేయడంతో టఫ్ ఫైట్‌గా మారింది. ఆఖరి రెండు బంతుల్లో 7 పరుగులు కావాల్సి ఉండగా ఐదో బంతికి రషీద్ ఖాన్ కొట్టిన భారీ షాట్‌ను బౌండరీ దగ్గర జోఫ్రా ఆర్చర్ క్యాచ్ పట్టేశాడు. ఆఖరి బంతి డాట్ కావడంతో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. 19వ ఓవర్‌లో జోఫ్రా ఆర్చర్, 20వ ఓవర్‌లో తుషార్ దేశ్‌పాండే నాలుగు నాలుగు పరుగుల చొప్పున ఇవ్వడంతో రాజస్థాన్ రాయల్స్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ గెలుపునకు ఈ ఇద్దరే కారణమైనా.. మ్యాచ్‌ని మలుపు తిప్పింది మాత్రం రవి బిష్ణోయే 44 బంతుల్లో 73 పరుగులు బాదిన సాయి సుదర్శన్‌తో పాటు గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియాను వరుస ఓవర్లలో అవుట్ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో నిలవగా, గుజరాత్ వరుసగా రెండు ఓటములతో ఏడో స్థానానికి పడిపోయింది.