హైదరాబాద్‌లో భూముల ధరలకు రెక్కలు వస్తున్నాయి. గజం లక్షల్లో పలుకుతూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తాజాగా కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ ()లో ఉన్న భూములకు వేలం నిర్వహించగా.. కళ్లు చెదిరే మొత్తంలో ఆదాయం లభించింది. ఏకంగా రూ.24.26 కోట్ల ఆదాయం హౌసింగ్ బోర్డుకు సమకూరినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇందులో ఒక్క ప్లాట్‌లో గజం ధర ఏకంగా రూ.2.65 లక్షలు పలకడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇటీవలి కాలంలో హైదరాబాద్ నగరంలో ఉన్న ఖాళీ స్థలాలను హౌసింగ్ బోర్డు అధికారులు వేలం నిర్వహిస్తుండగా.. రికార్డు స్థాయి ధరలు పలుకుతున్నాయి. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్వహించిన హౌసింగ్ బోర్డు వేలంలో గజం భూమి ధర రూ.2.65 లక్షలకు చేరుకోవడం నగర రియల్ ఎస్టేట్ రంగంలో సంచలనం రేపుతోంది. ఈ వేలంలో భారీగా బిడ్డర్లు పాల్గొనడంతో ప్లాట్లు, ఫ్లాట్లు ఎవరూ ఊహించని ధరలు పలికాయి. ఈ ప్లాట్‌లకు కనీస అప్‌సెట్ ధర గజానికి రూ.1.30 లక్షలుగా హౌసింగ్ బోర్డు అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే వేలంలో బిడ్డర్లు పోటా పోటీగా పాట పాటడంతో చివరికి గజం ధర రూ.2.65 లక్షల వద్ద ముగిసింది. అయితే కేపీహెచ్‌బీ ప్రాంతంలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ధర ఇదే అని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. ఈ వేలంలో మొత్తం 40 మంది బిడ్డర్లు పాల్గొన్నట్లు హౌసింగ్ బోర్డు అధికారులు తెలిపారు. ప్రతి ప్లాట్, ఫ్లాట్ కోసం తీవ్ర పోటీ నెలకొందని పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా కేపీహెచ్‌బీ ఫేజ్–1, ఫేజ్–2లోని ధర్మారెడ్డి కాలనీలో 4 ఓపెన్ ప్లాట్లు ఉండగా.. అవి భారీ ధర పలికాయి. తక్కువ సంఖ్యలో ప్లాట్ల ఉండటంతో అధిక ధరలకు కొనుగోలు చేయడానికి బిడ్డర్లు వెనక్కి తగ్గలేదు. మరోవైపు కేపీహెచ్‌బీ ఫేజ్–15లోని సంపూర్ణం అపార్ట్‌మెంట్‌లో ఉన్న 8 ఫ్లాట్లను కూడా హౌసింగ్ బోర్డు అధికారులు తాజా వేలంలో విక్రయించారు. 1400 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఫ్లాట్ అత్యధికంగా రూ.1.10 కోట్లకు విక్రయం అయింది. ఈ ఫ్లాట్లకు కనీస అప్‌సెట్ ధర రూ.90 లక్షలు నిర్ణయించగా.. వేలంలో బిడ్డర్ల మధ్య విపరీతమైన పోటీ కారణంగా భారీగా ధరలు పెరిగినట్లు చెప్పారు. తాజాగా నిర్వహించిన వేలం ద్వారా హౌసింగ్ బోర్డుకు మొత్తంగా రూ.24.26 కోట్ల ఆదాయం వచ్చింది. ఇదే ఇప్పుడు తెలంగాణ సర్కార్‌కు భారీ ఆదాయ వనరుగా నిలవడమే కాకుండా.. రియల్ ఎస్టేట్ రంగంలో కేపీహెచ్‌బీ కాలనీకి ఉన్న డిమాండ్‌ను రుజువు చేసింది.