హైదరాబాద్ నగరవాసులకు గుడ్‌న్యూస్. రానున్నాయి. మెట్రో ట్రైన్లను కనెక్ట్ చేస్తూ.. పర్సనల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ (పీఆర్‌టీ) పేరిట ప్రభుత్వం ఈ ట్యాక్సీలు తీసుకురానుంది. మెట్రోరైలు స్టేషన్ల నుంచి ప్రయాణికులు తొందరగా తమ గమ్యస్థానం చేరేందుకు ఈ పాడ్‌ ట్యాక్సీలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలోనే చేపట్టాలనేది ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్‌(డీబీఎఫ్‌వోటీ) విధానంలో సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల అధ్యయనానికి కన్సల్టెంట్‌ ఎంపిక చేయనున్నారు. అందు కోసం హైదరాబాద్‌ మెట్రో రైలు లిమిటెడ్‌ రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌(ఆర్‌ఎఫ్‌పీ) నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రస్తుతం నగరంలో దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులు మెట్రోలను ఆశ్రయిస్తున్నారు. నగరం ఓ మూల నుంచి మరో మూలకు త్వరగా చేరుకునేందుకు మెట్రో బెస్ట్ ఆప్షన్ అయింది. అయితే మెట్రో దిగిన తర్వాత తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు బస్సులు, ఆటోలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఇవి అన్ని చోట్ల అందుబాటులో ఉండటం లేదు. ఉన్నా డబ్బులు ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు. దానికి తోడు ట్రాఫిక్‌లో నరకం. ఈ ఇబ్బందులను తొలగించేందుకు.. మెట్రో స్టేషన్ల నుంచి రోడ్ల మీదకు రావాల్సిన అవసరం లేకుండా నేరుగా పాడ్‌ట్యాక్సీల ద్వారా గమ్యస్థానాలను చేరుకునేలా వినూత్న రవాణా వ్యవస్థ ప్రవేశపెట్టేందుకు సర్కార్ రెడీ అయింది. ముందుగా.. రాయదుర్గం-కూకట్‌పల్లి, రాయదుర్గం-హైటెక్‌సిటీ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్ మెట్రో స్టేషన్లు, నాలెడ్జి సిటీ, సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. పాడ్‌ ట్యాక్సీలు పూర్తిగా ఆటోమేటెడ్, డ్రైవర్‌ లేకుండా నడుస్తాయి. ఎలివేటెడ్‌ ట్రాక్‌లపై నడిచే ఈ ట్యాక్సీలు..గంటకు గరిష్ఠంగా 40 కి.మీ. వేగంతో ప్రయాణిస్తాయి. ప్రతి పాడ్‌ ట్యాక్సీలో 6 నుంచి 8 మంది ప్రయాణించవచ్చు. గంటకు 10వేల మందిని చేరవేసే సామర్థ్యం ఉంటుంది. బ్యాటరీ లేదా విద్యుత్తు వినియోగంతో ఎలాంటి కాలుష్యం సమస్య తలెత్తదు. మెట్రో స్టేషన్‌లో దిగడానికి కంటే ముందు పాడ్‌ట్యాక్సీని బుక్‌ చేసుకోవడం ద్వారా సమయా ఆదా అవుతుంది. ఇలాంటి రవాణా వ్యవస్థ ప్రస్తుతం ముంబైలో పట్టాలెక్కుతుండగా.. త్వరలోనే హైదరాబాద్ నగరంలోనూ అందుబాటులోకి రానుంది.