హైదరాబాద్ నగరంలోని పేదలకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అమలు చేసేందుకు రెడీ అయింది. ఉగాదిలోపు నగరంలో లబ్ధిదారులకు ఇండ్ల మంజూరుకు సంబంధించిన పత్రాలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు అర్హుల లబ్ధిదారుల జాబితాను ఖరారు చేసి మంజూరు పత్రాలు అందించేందుకు సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్ పరిధిలోని 3 కార్పొరేషన్ల పరిధిలో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ ప్రాంతాల నుంచి భారీగా దరఖాస్తులు రావడంతో అధికారులు ఇప్పటికే ఫీల్డ్ సర్వే చేపట్టారు. సొంత స్థలాలు ఉన్నా.. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇల్లు నిర్మించుకోలేని పేదలకు తొలి విడతలో ఇళ్ల మంజూరు పత్రాలు అందించనున్నారు. ఆదాయ పరిమితి, భూ యాజమాన్య పత్రాలు, కుటుంబ పరిస్థితులు వంటి అంశాల ఆధారంగా లబ్ధిదారులను నిర్ణయిస్తారు. గ్రేటర్ పరిధిలో మొత్తంగా సుమారు 12 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఇప్పటివరకు 18 వేల మందిని అర్హులుగా గుర్తించినట్లు వివరించారు. కాగా, ఈ అప్లికేషన్లను అధికారులు మరోసారి రీ వెరిఫికేషన్ చేయనున్నారు. ఈ ప్రక్రియను వారంలోగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇక మురికివాడల్లో ఇందిరమ్మ మోడల్ కాలనీల నిర్మాణాలకు సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. స్థలాల సేకరణ ప్రక్రియపై ఇటీవల మంత్రులు అధికారులతో చర్చించారు. వారు ఉంటున్న ప్రాంతాల్లోనే 5 నుంచి 10 అంతస్తుల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి అందించాలని ప్రభుత్వా భావిస్తోంది. నగరానికి దూరంగా ఇళ్లను కేటాయిస్తే వారి జీవనోపాధి దెబ్బతింటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇండ్లకు అదనంగా మరో నగరంలోని మరో 28 వేల మంది పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను ఇవ్వాలని భావిస్తున్నారు. దాంతో పాటుగా గృహలక్ష్మి పథకం లబ్ధిదారులకు కూడా పథకాన్ని వర్తింపజేయనున్నారు. నిర్మాణ పనులు మధ్యలో నిలిచిపోయి ఇప్పుడు మళ్లీ మొదలుపెడితే హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రూ. 5 లక్షల సాయం అందించనున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం శరవేగంగా అమలవుతోంది. ఇప్పటివరకు 3 లక్షల ఇళ్లు మంజూరు చేయగా.. 2.50 లక్షల మంది లబ్ధిదారులు నిర్మాణ పనులు ప్రారంభించారు. వచ్చే నెలాఖరు నాటికి లక్ష ఇండ్లు పూర్తి చేయాలని అధికారులు టార్గెట్‌గా పెట్టుకున్నారు.