టాలీవుడ్ సెలబ్రిటీ జంట విజయ్‌ దేవరకొండ - రష్మిక మందన మరికొన్ని గంటల్లో పెళ్లి పీటలేక్కబోతున్నారు. చాలా కాలంగా రిలేషన్ షిప్ లో ఉన్న వీరు.. ఎట్టకేలకు వివాహబంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఉదయ్ పూర్ లోని ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్‌లో ఈ వెడ్డింగ్ జరగబోతోంది. ఇప్పటికే ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ తో హంగామా మొదలైంది. సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఒక్కరొక్కరుగా రాజస్థాన్ లో ల్యాండ్ అవుతున్నారు. విజయ్ - రష్మికల పెళ్లికి ప్రధాని మోదీ కూడా శుభాకాంక్షలు తెలిపారు. విజయ్‌ దేవరకొండ - రష్మిక వెడ్డింగ్ కార్డుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజయ్‌ తల్లిదండ్రులు పంపించారు. దీనిపై మోదీ స్పందిస్తూ కాబోయే వధూవరులకు విషెస్ తెలుపుతూ ఆశీస్సులు అందించారు. ఈ మేరకు భారత ప్రధాని కార్యాలయం నుంచి ఓ లేఖను పంపించారు. ''శ్రీమతి మాధవి & శ్రీ గోవర్ధన్ రావు దేవరకొండ గారికి, ఫిబ్రవరి 26, 2026న జరగనున్న విజయ్ - రష్మికల వివాహ వేడుకకు నన్ను ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఆనందకరమైన పవిత్రమైన సందర్భంలో దేవరకొండ, మందన్న కుటుంబాలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు''''విజయ్ - రష్మికల జీవితంలో ఇది ఒక కొత్త, అందమైన అధ్యాయానికి ఆరంభం. సఖా సప్తపదా భవ అనే స్ఫూర్తితో, కలిసి ఏడడుగులు వేస్తోన్న ఈ జంట జీవితాంతం స్నేహితులుగా కలిసుండాలని కోరుకుంటున్నాను. ఉమ్మడి కలలతో, వాటి నెరవేర్పుతో నిండిపోవాలని, రానున్న కాలమంతా కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షిస్తున్నా. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ నిజమైన భాగస్వాములుగా వారి జీవిత ప్రయాణం సాగాలి. ఈ చిరస్మరణీయ సందర్భంలో ఆ జంటకు, వారి కుటుంబ సభ్యులకు నా ఆశీస్సులు, శుభాకాంక్షలు'' అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.*