ఏపీ ప్రభుత్వం మహిళలకు 'స్త్రీ శక్తి పథకం' కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం లేదు. ఇటీవల వారికి కూడా ఫ్రీ జర్నీ సౌకర్యం కల్పించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలిపారు. తాజాగా.. ఏపీలోని దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత సదుపాయం కల్పిస్తూ ప్రభుత్వం శనివారం (ఫిబ్రవరి 28) అధికారిక ఉత్తర్వులు జారీచేసింది. సిటీ ఆర్డినరీ, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలకు ప్రస్తుతం స్త్రీశక్తి పథకం కింద ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. వీటిలో దివ్యాంగులకు కూడా తాజాగా ఉచిత ప్రయాణం వర్తింపజేసింది. 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తిస్తుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. గతేడాది డిసెంబరు 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. దివ్యాంగుల కోసం ఇంద్రధనస్సు పేరిట ఆరు పథకాలు ప్రకటించారు. అందులో ఉచిత బస్సు ప్రయాణ (మగవారికి సైతం) పథకం కూడా ఉంది. ఈ మేరకు ఫిబ్రవరి 24న కేబినెట్‌ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీచేశారు.ప్రస్తుతం దివ్యాంగులకు మెట్రో ఎక్స్‌ప్రెస్, అల్ట్రా పల్లెవెలుగు, పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, నాన్‌ స్టాప్, ఇంటర్‌స్టేట్‌, తిరుమల ఘాట్‌లో తిరిగే సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌, అల్ట్రా డీలక్స్‌ బస్సు సర్వీసుల్లోని టికెట్‌ ఛార్జీలో 50 శాతం రాయితీ ఇస్తున్నారు. ఇక విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోని సిటీ ఆర్డినరీ బస్సుల్లో మాత్రం ఉచిత ప్రయాణ సదుపాయం ఉంది. తాజా ప్రభుత్వ ఉత్తర్వు నేపథ్యంలో పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ దివ్యాంగుల ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తారు. నాన్‌స్టాప్, సప్తగిరి ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్, అంతర్‌రాష్ట్ర బస్సు సర్వీసుల్లో ప్రస్తుతం ఉన్నట్లే 50 శాతం రాయితీ కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏపీలో 11 లక్షల మంది దివ్యాంగులు ఉన్నట్లు సంబంధిత శాఖ అధికారులు ఆర్టీసీకి వివరాలు అందజేయగా.. ప్రస్తుతం ఆర్టీసీలో 2 లక్షల మంది దివ్యాంగులు మాత్రమే పాస్‌ వినియోగించుకుంటున్నట్లు తేలింది.