తెలంగాణలో సాగు చేసే రైతులకు తీపి కబురు. గెలలకు రికార్డు ధర పలుకుతోంది. టన్ను గెలల ధర రూ.21,546గా నమోదైందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ధర పెరుగుదలతో తెలంగాణలోని 15,024 మంది రైతులకు రూ.2 కోట్ల మేర అదనపు లబ్ధి చేకూరనుందని తెలిపారు. తెలంగాణలోని ఆయిల్‌ఫెడ్‌ కర్మాగారాల్లో నూనె రికవరీ శాతం, ముడి పామాయిల్‌ అమ్మకం ధరల ఆధారంగా ప్రతినెలా గెలల ధరను నిర్ణయిస్తారని ఆయన వెల్లడించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అప్పరావుపేట, అశ్వారావుపేటలోని కర్మాగారాలలో కొత్త యంత్రాలను ఏర్పాటు చేసి నూనె రికవరీని 20.01 శాతానికి పెంచడంతో తాజాగా పెరిగిందని చెప్పారు. ప్రజాప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి 33,500 మంది రైతులు 1,07,400 ఎకరాలలో ఆయిల్‌పామ్‌ సాగు చేపట్టినట్లు వెల్లడించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ సాగు కోసం రూ.456 కోట్లు కేటాయించామన్నారు. వచ్చే ఏడాది మరో 2లక్షల ఎకరాలలో ఆయిల్‌పామ్‌ సాగు చేపట్టేందుకు చర్యలు చేపట్టినట్లు తుమ్మల వివరించారు. కాగా, ఆయిల్ పామ్ సాగులో పెట్టుబడి భారాన్ని తగ్గించడానికి తెలంగాణ ప్రభుత్వం మొక్కల సరఫరాపై భారీగా సబ్సిడీ ఇస్తోంది. ఒక్కో మొక్క ధరలో దాదాపు 80 నుంచి 90 శాతం వరకు రాయితీ ఇస్తుంది. నాణ్యమైన మొక్కలను ప్రభుత్వ గుర్తింపు పొందిన నర్సరీల నుండి చాలా తక్కువ ధరకే పొందేలా ఉద్యానవన శాఖ ఏర్పాట్లు చేసింది. ఆయిల్ పామ్ పంటకు నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది, ఈ నేపథ్యంలో 100 శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు పూర్తి ఉచితంగా, ఇతర రైతులకు కూడా దాదాపు 80 శాతం పైగా రాయితీతో డ్రిప్ యూనిట్లను మంజూరు చేస్తోంది. ఆయిల్ పామ్ నాటిన మొదటి 3 నుండి 4 ఏళ్ల వరకు రైతులకు ఎటువంటి ఆదాయం రాదు. ఈ కాలాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ప్రభుత్వం అంతర పంటల సాగును కూడా ప్రోత్సహిస్తోంది. వేరుశనగ, మిరప, ఇతర కూరగాయలు సాగు చేసుకునేందుకు రైతులకు అదనపు ప్రోత్సాహకాలను అందిస్తుంది. ఇక రైతులకు మార్కెటింగ్ భయం లేకుండా ప్రభుత్వం ప్రముఖ కంపెనీలతో బై-బ్యాక్ ఒప్పందాలు కుదుర్చుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధరకు అదనంగా, మార్కెట్ ధరల అనుగుణంగా రైతులకు గిట్టుబాటు ధర లభించేలా తెలంగాణ ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది.