Gold Price: ప్రపంచ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు సామాన్యుల జేబుకు చిల్లు పెట్టబోతున్నాయా? అంటే అవుననే అంటున్నారు ఆర్థిక నిపుణులు. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయ మార్కెట్లను వణికిస్తోంది. ప్రస్తుతం ఉన్న ధరలు రాబోయే రోజుల్లో ఊహించని స్థాయికి పెరుగుతాయని, బంగారం ధర తులం (10 గ్రాములు) ఏకంగా రూ. 2 లక్షల మార్కును తాకవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం బంగారం మాత్రమే కాదు, వెండి కూడా సరికొత్త రికార్డులను సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది.100 డాలర్లకు వెండి ధరఅంతర్జాతీయ కమోడిటీ మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం వెండి ధరలో భారీ విస్ఫోటనం సంభవించవచ్చు. ప్రస్తుతం ఉన్న ధరలతో పోలిస్తే కామెక్స్ మార్కెట్లో వెండి ధర ఒక ఔన్స్‌కు 100 డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. పారిశ్రామికంగా వెండికి ఉన్న డిమాండ్, ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఇందుకు ప్రధాన కారణం. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో సురక్షితమైన పెట్టుబడిగా భావించే వెండి వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతారని ఇది ధరలను అమాంతం పెంచుతుందని సమాచారం. రూ.2 లక్షల మార్కుకు తులం బంగారం?అయితే, యుద్ధం గనుక సంభవిస్తే ఇండియాలో 10 గ్రాముల బంగారం ధర రూ. 2 లక్షలకు చేరుకోవడం అసాధ్యమేమీ కాదని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఒక ఔన్స్‌కు 5,000 డాలర్ల నుంచి 6,000 డాలర్ల మధ్యకు చేరితే, రూపాయి విలువ క్షీణత, దిగుమతి సుంకాల ప్రభావంతో దేశీయ మార్కెట్‌లో ఈ భారీ ధరలు చూసే అవకాశం ఉందని చెబుతున్నారు.యుద్ధం లేదా ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతాయి. అటువంటి సమయంలో ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. కరెన్సీ విలువ పడిపోయే ప్రమాదం ఉన్నందున, అందరూ బంగారం వంటి సురక్షిత మార్గాల్లో పెట్టుబడి పెడతారు. ఇరాన్, అమెరికా మధ్య ఘర్షణలు చమురు సరఫరాపై కూడా ప్రభావం చూపుతాయి, ఇది ద్రవ్యోల్బణానికి దారితీసి పరోక్షంగా బంగారం ధరలను పెంచుతుంది.కేవలం యుద్ధం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని నిల్వ చేసుకోవడం కూడా ఒక కీలక కారణం. వెండి విషయానికి వస్తే, ఇది కేవలం పెట్టుబడి సాధనమే కాదు, ఎలక్ట్రానిక్స్, సోలార్ పరిశ్రమల్లో కీలకమైన లోహం. కాబట్టి, యుద్ధం వల్ల తలెత్తే సరఫరా అంతరాయాలు వెండి ధరను 100 డాలర్ల వైపు నడిపిస్తాయి. అమెరికా-ఇరాన్ మధ్య పరిస్థితులు సద్దుమణిగితే ధరల్లో స్థిరత్వం ఉండవచ్చు. కానీ, దాడులు మొదలైపోయాయి. దీంతో వెండి, బంగారం సామాన్యులకు అందని ద్రాక్షలా మారే ప్రమాదం ఉంది. ఇన్వెస్టర్లు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తూ తమ పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.