ఖమేనీ 36 ఏళ్ల ఏకఛత్రాధిపత్యానికి ఫుల్‌స్టాప్.. సొంత ప్రజల్లోనే వ్యతిరేకత ఎందుకు, ఆయన ప్రస్థానమేంటీ?

Wait 5 sec.

. గత కొన్ని రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బాగా వినిపిస్తున్న పేరు ఇది. ఇరాన్ అధినేతగా.. గత 36 ఏళ్లుగా ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగుతున్న అయతొల్లా అలీ ఖమేనీని.. ఇజ్రాయెల్ దళాలు శనివారం మట్టుబెట్టినట్లు ప్రకటించాయి. అటు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇదే విషయాన్ని తెలపగా.. ఇరాన్ ప్రభుత్వ మీడియా కూడా ఖమేనీ మృతిని ధృవీకరించింది. ఖమేనీ మృతికి సంతాపంగా దేశవ్యాప్తంగా 40 రోజుల పాటు సంతాప దినాలను కూడా ప్రకటించింది. అయితే ఒకవైపు ఖమేనీ మద్దతుదారులు తీవ్ర దుఃఖంలో మునిగిపోగా.. చాలా మంది ఇరానీయన్లు మాత్రం పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. ఖమేనీ మరణవార్త ప్రపంచవ్యాప్తంగా తెలియడంతో.. 1989 నుంచి ఇప్పటివరకు గత 36 ఏళ్లుగా తన గుప్పిట్లో ఇరాన్‌ను పెట్టుకున్న శకం ముగిసిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు.. నేపథ్యంలో షియా ముస్లింలకు ప్రధాన యాత్రాస్థలమైన మషద్‌లోని ఇమామ్ రెజా మందిరంపై నల్లజెండాను ఎగురవేశారు. ఈ ఘటనతో ఆయన మద్దతుదారులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక ఖమేనీ మరణించిన వార్త తెలుసుకుని ఆ దేశ ప్రజలు సంబరాలు చేసుకోవడం చూస్తుంటే.. ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎంత క్రూరంగా ఉంటాయో అర్థం అవుతున్నాయి. ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌తోపాటు కిరాజ్ సహా పలు నగరాల్లో ప్రజలు స్వేచ్ఛ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇక లండన్, లాస్ ఏంజిల్స్, మెల్‌బోర్న్ వంటి విదేశాల్లో ఉన్న ఇరాన్ ప్రజలు కూడా ఖమేనీ మృతి నేపథ్యంలో వేడుకలు జరుపుకుంటున్నారు.1979లో ఇరాన్ విప్లవం తర్వాత అయతొల్లా అలీ ఖమేనీ.. ఒక కీలక నేతగా ఆ దేశ రాజకీయాల్లో మారారు. ఆ తర్వాత 1981 నుంచి 1989 వరకు ఇరాన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఇరాన్ మొదటి సుప్రీం లీడర్ అయతొల్లా ఖొమేనీ 1989లో మరణించిన తర్వాత.. అయతొల్లా అలీ ఖమేనీ ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్‌గా ఆ పదవిలోకి వచ్చారు. అప్పటి నుంచి ఫిబ్రవరి 28వ తేదీన చనిపోయే వరకు కూడా 36 ఏళ్లుగా అయతొల్లా అలీ ఖమేనీ కనుసన్నల్లోనే ఇరాన్ పాలన కొనసాగింది. ఇరాన్ సైన్యం (ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ -ఐఆర్‌జీసీ), ఇరాన్ న్యాయవ్యవస్థ, ఇరాన్ మీడియా మొత్తం ఖమేనీ ఆదేశాల మేరకే నడిచేది. అదే సమయంలో మిడిల్ ఈస్ట్‌లో అత్యధిక కాలం పరిపాలించిన నేతగా ఖమేనీకి పేరుంది. తన హాయంలో ఇరాన్‌ను ఖమేనీ.. ఒక బలమైన మతరాజ్యంగా మార్చారు. మధ్యప్రాచ్యంలో ఇరాన్‌ను ప్రాంతీయ శక్తిగా మార్చాలని అహర్నిషలు ఆరాటపడిన ఖమేనీ.. తన ఆకాంక్షకు వ్యతిరేకంగా నిరసనలు చేసిన వారిని అత్యంత దారుణంగా అణచివేశారు.ఇరాన్ యువతతోపాటు.. సాధారణ ప్రజల్లో కూడా ఖమేనీ పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉన్న విషయం మొత్తం ప్రపంచానికి తెలిసిందే. అందుకు ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు, అమలు చేసిన కఠిన చట్టాలే. ఇస్లామిక్ చట్టాల పేరుతో మహిళల బట్టలు (హిజాబ్ ధరించడం), వ్యక్తిగత స్వేచ్ఛపై తీవ్రమైన ఆంక్షలు విధించారు. ఈ క్రమంలోనే 2022లో మహసా అమిని అనే 22 ఏళ్ల యువతి హిజాబ్ ధరించలేదన్న ఆరోపణలతో పోలీసులు జరిపిన దాడిలో ఆమె మరణించడం ఆ దేశంలో పెను సంచలనం రేపింది. ఆ తర్వాత మహసా అమిని మృతితో ఇరాన్‌లో చెలరేగిన నిరసనలు క్రమంగా తీవ్ర రూపం దాల్చాయి. అదే సమయంలో ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షలు కూడా ప్రజల్లో ఖమేనీపై తీవ్ర వ్యతిరేకతకు కారణం అయ్యాయి. ఈ క్రమంలోనే ఇరాన్ కరెన్సీ విలువ దారుణంగా పడిపోవడం.. అక్కడ నిరుద్యోగం, ద్రవ్యోల్బణం గతంలో ఎన్నడూ లేని స్థితికి పెరిగిపోడం చోటు చేసుకున్నాయి. ఒకవైపు.. ఇరాన్‌ ప్రజలు తిండిలేక ఆకలితో అలమటిస్తుంటే.. మరోవైపు.. దేశ సంపదను మొత్తం క్షిపణులు, అణు కార్యక్రమాల కోసం ఖమేనీ ఖర్చు చేస్తుండటం అక్కడి ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణం అయ్యాయి. ఖమేనీ ప్రభుత్వంపై విమర్శలు చేసేవారిని.. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆందోళన చేసే వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం, కొందరిని ఉరితీయడం వంటి ఘటనలు ప్రజల్లో తీవ్ర భయాన్ని, ప్రభుత్వంపై ద్వేషాన్ని పెంచాయి. తాజాగా ఈ ఏడాదిలో చెలరేగిన లయన్ అండ్ సన్ విప్లవం కూడా ఖమేనీని గద్దె దించాలనే లక్ష్యంతోనే చేపట్టారు.మరోవైపు.. ముస్లిం దేశమైన ఇరాన్.. మిగిలిన ముస్లిం దేశాలపై దాడులు చేయడం కూడా ఖమేనీ అంతానికి ఒక కారణంగా మారింది. షియా ముస్లిం దేశమైన ఇరాన్‌కు.. ఇతర సున్నీ ముస్లిం దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ మధ్య గత కొన్ని దశాబ్దాలుగా తీవ్ర ఆధిపత్య పోరు కొనసాగుతోంది. మధ్య ప్రాచ్యంలో పట్టు సాధించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ఇరాన్.. లెబనాన్‌లోని హెజ్‌బొల్లా.. యెమెన్‌లోని హౌతీలు.. ఇరాక్, సిరియా దేశాల్లోని మిలిటెంట్ గ్రూపులకు మద్దతు ఇస్తూ ఆయా దేశాల్లో అస్థిరతకు కారణం అయింది. తాజాగా ఖమేనీపై జరిగిన దాడిని తీవ్రంగా పరిగణించిన ఇరాన్.. దీనికి ప్రతీకారంగా కువైట్, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా భీకర క్షిపణి దాడులకు దిగింది. తమపై దాడి చేసేందుకు ఈ దేశాలన్నీ అమెరికాకు సహకరిస్తున్నాయనే అనుమానంతో ఆయా దేశాలపై ఇరాన్ ఈ దాడులకు తెగబడింది. ఇజ్రాయెల్‌ను ప్రపంచ పటం నుంచి తొలగించాలనేది ఖమేనీ లక్ష్యం కాగా.. ఈ పోరులో ఇజ్రాయెల్‌తో సంబంధాలు ఉన్న ముస్లిం దేశాలను కూడా ఇరాన్ తమకు శత్రువులుగానే చూస్తోంది. అందుకే ఆయా దేశాలపై దాడులకు దిగుతోంది.ఖమేనీ మరణంతో ఇరాన్‌లో ఒక సుదీర్ఘ పాలన అంతమైంది. అయితే.. ఖమేనీకి వారసులుగా వచ్చే వారు కూడా అమెరికా, ఇజ్రాయెల్ సహా ఇతర ముస్లిం దేశాలపై ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ.. అదే రకమైన చర్యలను కొనసాగిస్తారా.. లేక ఆ దేశాన్ని ప్రజాస్వామ్యం దేశంగా మారుస్తారా అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆసక్తిని కలిగిస్తోంది. ఖమేనీ రెండో కొడుకు అయిన మొజ్తబా ఖమేనీ.. తర్వాతి సుప్రీం లీడర్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.