ములుగు జిల్లాను ప్రాంతంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం పని చేస్తోందని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నేడు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యేలు వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లతో కలిసి జిల్లాలోని మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడిన ఆయన.. హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని సైతం అభివృద్ధి చేస్తామని అన్నారు. 'మల్లూరు గుట్టలో స్వయంభుగా వెలసిన హేమాచల లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలతో రైతన్నలు ఆనందంగా ఉండాలని, ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆ స్వామిని వేడుకోవడం జరిగింది. భక్తులు కోరిన కోరికలను ఆ స్వామి తీరుస్తారనే విశ్వాసం ఉంది. స్వామి వారిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ములుగు జిల్లాలో ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రాలు నెలవై ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా చేపట్టాం. 200 సంవత్సరాల వరకు చెక్కుచెదరకుండా ఉండే విధంగా ఆలయాన్ని అభివృద్ధి చేశాం. మేడారం మహా జాతరను విజయవంతం చేశాం. గోదావరి పరివాహక ప్రాంతమైన బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. వాటికి సంబంధించిన పనులు కూడా త్వరలోనే ప్రారంభిస్తాం. మంత్రి సీతక్క కోరిక మేరకు మల్లూరు దేవాలయాన్ని అద్భుతంగా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. భక్తుల మనోభావాలను అభిప్రాయాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుంది. త్వరలోనే ఆలయ అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేస్తాం.' అని మంత్రి స్పష్టం చేశారు. ఇక అంతకు ముందు మంత్రి పొంగులేటి కుటుంబ సమేతంగా సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకన్, అదనపు కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.