తెలంగాణలో రాజ్యసభ ఎన్నికల సందడి కనిపిస్తోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా.. నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మరి తెలంగాణ నుంచి పెద్దల సభకు వెళ్లేది ఎవరు అనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలు దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తుండగా.. ఆశావహుల లిస్ట్ చూస్తే చాలామంది ఉన్నారు. ఏకంగా 20 మంది పేర్లు తెరపైకి వచ్చాయట.. రాజ్యసభ ఎంపీ పదవి కోసం చాలామంది పోటీపడుతున్నారట. ఈ క్రమంలో టీ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. తెలంగాణలో తాజా పరిణామాలతో పాటుగా చర్చించారు. తెలంగాణ నుంచి కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు , ఏఐసీసీ కార్యదర్శి జెట్టి కుసుమ కుమార్‌లకు రాజ్యసభ సభ్యులుగా అవకాశం ఇవ్వాలని జగ్గారెడ్డి ఖర్గేను కోరినట్లు జగ్గారెడ్డి తెలిపారు. వీహెచ్ ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నారని.. గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్నారన్నారు. అలాంటి వీహెచ్‌‌ను రాజ్యసభకు పంపిస్తే.. పార్టీ నుంచి మంచి మెసేజ్ వెళుతుందన్నారు. ఇటు జెట్టి స్వాతంత్య్ర సమరయోధుడి కుమారుడని.. ఆయన యూత్ కాంగ్రెస్ నుంచి పార్టీలో కీలకంగా వ్యవహరించారు అన్నారు. ఆయన కమ్మ సామాజికవర్గంలో బలమైన నేతగా ఉన్నారన్నారు. వీరిద్దరిని రాజ్యసభకు పంపిస్తే బావుంటుంది అన్నారు. వీహెచ్, కుసుమ కుమార్‌లకు రాజ్యసభ అవకాశం కల్పించాలని ఇప్పటికే సీఎం రేవంత్‌ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్‌ల దృష్టికి తీసుకెళ్లా్నన్నారు జగ్గారెడ్డి. ఈ రెండు రాజ్యసభ స్థానాలకు అసమ్మతి లేదని.. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా, తాము కట్టుబడి ఉంటామన్నారు. జగ్గారెడ్డి వీహెచ్, కుసుమ కుమార్ పేర్లను ప్రస్తావించడంఆసక్తికరంగా మారింది.గతంలో బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి కేఆర్‌ సురేశ్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి అభిషేక్‌ సింఘ్వీలు రాజ్యసభ ఎంపీలుగా ఉన్నారు. వీరిద్దరి పదవీకాలం ఈఏడాది ఏప్రిల్‌ 9తో పూర్తవుతోంది. ఆ రెండు స్థానాలకూ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం మొత్తం 10 రాష్ట్రాల్లో 37 మంది రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీరందరి పదవీకాలం ఏప్రిల్ నెలలో పూర్తికానుంది.. ఇటీవల ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకాగా.. మార్చి 5 వరకు అవకాశం ఉంది. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 9 వరకు గడువు ఉంది. మార్చి16న పోలింగ్ జరగనుంది.. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది. అదేరోజున ఫలితాలు వెల్లిడిస్తారు. మరి తెలంగాణ నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి.