కేంద్రం ఏపీకి తీపికబురు చెప్పింది. 2025 ఖరీఫ్‌లో రాష్ట్రప్రభుత్వం వర్షాభావ పరిస్థితుల కారణంగా కరవు ప్రాంతాలుగా ప్రకటించిన అన్నమయ్య, శ్రీసత్యసాయి, ప్రకాశం జిల్లాల్లోని 37 మండలాలకు ఊరట దక్కింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉపాధిహామీ పథకం కింద 50 రోజుల అదనపు పనిదినాలు కల్పించనున్నారు. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ ఈ విషయాన్ని తెలియజేశారు. అదనపు పనిదినాలు కల్పిస్తూ కేంద్రం జారీచేసిన ఉత్తర్వుల్ని మంత్రి ట్వీట్ చేశారు. ఏపీలోని గ్రామీణ పేదల సంక్షేమం కోసం అదనపు ప్రయోజనం కలిగించారన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌లకు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ధన్యవాదాలు తెలిపారు.'కష్టసమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా నిలిచిన గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీ సత్యసాయి, అన్నమయ్య మరియు ప్రకాశం జిల్లాల కరువు ప్రభావిత 37 మండలాలకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ కింద అదనంగా 50 రోజుల ఉపాధి ఆమోదించడం (2025–26 ఆర్థిక సంవత్సరం) అత్యంత సమయోచిత నిర్ణయం. దీని ద్వారా ప్రతి కుటుంబానికి ఉపాధి పరిమితి 150 రోజులకు పెరిగి, గ్రామీణ కుటుంబాల జీవన భద్రత మరింత బలపడుతుంది. రైతులు, గ్రామీణ వర్గాల పట్ల నిరంతర కట్టుబాటుతో ఉన్న గౌరవ కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, కేంద్ర–రాష్ట్ర సమన్వయం మరింత బలపడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమాన్ని మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్తోంది' అంటూ కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ట్వీట్ చేశారు.'#DAYNRLM కింద స్వయం సహాయక సంఘాల మహిళల కోసం రూపొందించిన గ్రామీణ వ్యాపార ప్రణాళికను, Department of Posts మరియు IPPB తో సమన్వయం చేస్తూ సమీక్షించాం. డాక్ శాఖ మరియు ఐపీపీబీ అందిస్తున్న బ్యాంకింగ్, ఆర్థిక, బీమా మరియు ఇతర పౌరులకు ఉపయోగపడే సేవలను సమగ్రంగా అనుసంధానం చేస్తూ, Dak Niryat Kendra ద్వారా ఎగుమతి సౌకర్యాలను కల్పించడం ద్వారా స్వయం సహాయక సంఘాల వ్యాపారాలను మరింత బలపరచి, అంతర్జాతీయ మార్కెట్లకు విస్తరించే అవకాశాలను పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. స్వయం సహాయక సంఘాల మహిళల ఆదాయాలను గణనీయంగా పెంచేందుకు, #6కోట్ల లక్షపతి మహిళల లక్ష్యాన్ని సాధించేందుకు, మరియు సమగ్ర గ్రామీణ అభివృద్ధి ద్వారా #ViksitBharat2047 విజన్‌ను సాకారం చేసే దిశగా ఇది ఒక దృఢమైన ముందడుగు' అని మరో ట్వీట్ చేశారు.