పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాయి. కాలుష్యాన్ని అరికట్టేందుకు ముఖ్యంగా పాలిథిన్, ప్లాస్టిక్‌‌లను నిషేధించాయి. ప్రస్తుతం ప్లాస్టిక్, పాలిథిన్ సంచుల స్థానంలో క్లాత్, పేపర్ సంచుల్ని ఉపయోగిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా డ్వాక్రా మహిళలు కూడా వినూత్న ఆలోచన చేశారు. క్లాత్ సంచుల తయారీపై వీరంతా ఫోకస్ పెట్టారు.. అది కూడా చాలా తక్కువ ఖర్చుతోనే. డ్వాక్రా మహిళలు పాత చీరలను ఉపయోగించి సంచులు తయారు చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. చీమకుర్తికి చెందిన మెప్మా మహిళలు ఈ వినూత్న ఆలోచనతో ప్రశంసలు అందుకున్నారు. పాతచీరలతో కొత్త సంచుల్ని తయారు చేస్తున్నారు.రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్‌ను వాడొద్దని అధికారులు పదే, పదే చెబుతున్నారు. అయినా సరే చాలామంది పట్టించుకోవడం లేదు. చాలామంది వ్యాపారులు, షాపులు నిర్వహించేవారు ప్టాస్టిక్ కవర్లను ఉపయోగిస్తున్నారు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు సహా పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా షాపుల్లో పాలిథిన్ కవర్లు ఉపయోగిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి నెలా మూడో శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు అధికారులు, ప్రతిజా ప్రతినిధులు కూడా ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గతంలో చీమకుర్తిలో ఇటీవల నిర్వహించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాత చీరలతో సంచులు తయారు చేస్తున్నారు. మొత్తం 10 గ్రూపుల మహిళలు ఇలా పాత చీరలతో సంచులు తయారు చేసి ప్రదర్శనకు ఉంచారు. వీటిని ఉచితంగా పంపిణీ చేశారు. ఒక్క చీరతో ఏకంగా పది సంచులు తయారు చేయొచ్చంటున్నారు. ఈ సంచులతో సరుకులు, కూరగాయలు వంటివి తెచ్చుకోవచ్చు. మెప్మా మహిళలు పాత కాటన్ చీరల్ని ఇలా సంచులుగా తీర్చిదిద్దారు. ఈ సంచులు తక్కువ ఖర్చుతో తయారు చేయొచ్చని.. పర్యావరణానికి కూడా మంచింది అంటున్నారు. ఈ సంచుల తయారీని ప్రోత్సహిస్తే బావుంటుంది అంటున్నారు.. డ్వాక్రామహిళలకు కూడా ఉఫాధి కల్పించొచ్చు అంటున్నారు. ఆ దిశగా ఆలోచన చేయాలి అంటున్నారు.