భారత బౌలర్లను పొట్టుపొట్టు కొట్టిన జింబాబ్వే.. ఆఖరి 10 ఓవర్లలో 111 పరుగులు

Wait 5 sec.

. వరల్డ్ టాప్ క్లాస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఉన్నప్పటికీ ఆ రేంజ్ ప్రదర్శన మాత్రం చూడలేకపోతున్నాం. బుమ్రాకి తోడు అర్ష్‌దీప్, హార్దిక్ బౌలింగ్ చేస్తున్నా.. మిడిల్ ఓవర్లలో భారత్ వరుసగా విఫలమవుతూనే వస్తోంది. సౌతాఫ్రికాపై ఆరంభంలో అదరగొట్టిన భారత్.. మధ్య ఓవర్లలో వికెట్లు తీయలేక భారీ పరుగులు సమర్పించుకుంది. జింబాబ్వే‌పై అయితే కనీసం పవర్ ప్లేలో ఒక్కర్ని కూడా అవుట్ చేయలేకపోవడం అందర్నీ షాక్‌కి గురి చేసింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత బౌలర్లను జింబాబ్వే బ్యాటర్లు దీటుగా ఎదుర్కొన్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ 256 పరుగుల భారీ స్కోర్ నమోదు చేయడంతో.. జింబాబ్వేను చాలా తక్కువ పరుగులకే కట్టడి చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ.. అందరి అంచనాలను తారుమారు చేస్తూ జింబాబ్వే ఓపెనర్లు భారత బౌలర్లకు షాకిచ్చారు. ఈ ఇద్దరూ పవర్ ప్లే వరకూ అవుట్ కాకుండా ఏకంగా 44 పరుగులు బాదేశారు. మొదటి పది ఓవర్ల వరకూ నిదానంగా ఆడుతూ వచ్చిన జింబాబ్వే బ్యాటర్లు ఆ తర్వాత నుంచి హిట్టింగ్ ఆరంభించారు. పది ఓవర్ల సమయానికి జింబాబ్వే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 73 పరుగులు చేసింది. పదో ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సికందర్ రజా కాస్తంత స్పీడు పెంచడం, ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ తనదైన శైలిలో విరుచుకుపడటంతో పరుగులు వాటంతట అవే వచ్చాయి. బ్రియాన్ బెన్నెట్ వికెట్ తీసుకోవడానికి భారత బౌలర్లు శతవిధాలుగా ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. సికందర్ రజా 21 బంతుల్లో 31 పరుగులు చేసి అవుటవ్వగా.. బ్రియాన్ బ్రెన్నెట్ 59 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 97 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో జింబాబ్వే ఆఖరి పది ఓవర్లలో ఏకంగా 111 పరుగులు చేసింది. దాంతో జింబాబ్వే 20 ఓవర్లలో 184/6 పరుగులు చేయగలిగింది.ముఖ్యంగా ఆఖరి ఐదు ఓవర్లలో శివమ్ దూబే రెండు ఓవర్లు బౌలింగ్ చేయడం, ఆ రెండు ఓవర్లలో 46 పరుగులు రావడంతో జింబాబ్వే స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. జింబాబ్వే జట్టును భారత బౌలర్లు ఆలౌట్ చేస్తారని అందరూ అనుకున్నా.. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా విఫలమవ్వడంతో బౌలింగ్ విభాగం చేతులెత్తేసింది. ఆఖర్లో అర్ష్‌దీప్ మూడు వికెట్లు తీయడంతో కనీసం ఆరుగురు బ్యాటర్లను అయినా అవుట్ చేయగలిగారు. అక్షర్ పటేల్ 7వ ఓవర్‌లో బ్రేక్ త్రూ ఇవ్వడంతో టీమిండియా తొలి వికెట్ తీయగలిగింది. వరుణ్ చక్రవర్తి కూడా ఒక వికెట్ తీసుకున్నాడు. శివమ్ దూబే ఆఖరి ఓవర్‌లో ఒక వికెట్ పడగొట్టగా.. అర్ష్‌దీప్‌కి మూడు వికెట్లు దక్కాయి. హార్దిక్, బుమ్రాకి ఎలాంటి వికెట్లు దక్కలేదు. ఇదే బౌలింగ్ విభాగంతో వెస్టిండీస్‌పై భారత్ ఏ విధంగా రాణిస్తుందో వేచి చూడాలి.