తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు గురువారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్రుని ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. తొలిరోజు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామివారు పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు తిరిగి భక్తులను ఆశీర్వదించారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది.ఆలయంలో ప్రతీ ఏడాది ఘనంగా నిర్వహించే ఐదు రోజుల తెప్పోత్సవాలను “తెప్ప తిరునాళ్లు”గా పిలుస్తారు. ఈ సందర్భంగా శ్రీవారు స్వామి పుష్కరిణిలో అలంకరించిన తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. జీవన సాగరంలో మునిగిపోకుండా భక్తులను రక్షించే దైవానుగ్రహానికి ఇది ప్రతీకగా భావిస్తారు. తెప్ప అనగా పడవ, ఓడ. ఓడలో సుఖాశీనులైన శ్రీవారిని కోనేటిలో విహారం చేయించడాన్నే తెప్పోత్సవం అంటారు. తిరుమలలో తెప్పోత్సవాలు అత్యంత ప్రాచీనకాలం నుండి జరుగుతున్నాయని తెలుస్తోంది. ప్రతి సంవత్సరం ఫాల్గుణ / చైత్ర మాసాల్లో (ఫిబ్రవరి–మార్చి) ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి.శ్రీ సాళువ నరసింహరాయలు క్రీ.శ 1468లో పుష్కరిణి మధ్యలో నీరాళి మండపాన్ని నిర్మించి తెప్పోత్సవాలకు అనువుగా తీర్చిదిద్దారు. ఆయన కుమారుడు పెద్ద తిరుమలయ్య పుష్కరిణి పునరుద్ధరణ చేపట్టి, స్వామి పుష్కరిణి – వరాహ పుష్కరిణిలను వేరు చేసినట్లు శాసనాల్లో పేర్కొనబడింది. క్రీ.శ.15వ శతాబ్దానికి చెందిన శ్రీ తాళ్లపాక అన్నమయ్య తిరుమల తెప్పోత్సవాలను గొప్పగా కీర్తించారు. మధ్యలో కొంతకాలం విరామం వచ్చినప్పటికీ, 1921లో తిరిగి ఈ ఉత్సవాలు పునరుద్ధరించబడ్డాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి తెప్పోత్సవాల కారణంగా ఫిబ్రవరి 26,27 తేదీల్లో సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది.ఫిబ్రవరి 28న, మార్చి 01, 02వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసినట్లు తెలిపారు. తెప్పోత్సవాలు మార్చి 2వ తేదీ వరకు కొనసాగనున్నాయి.మార్చి నెలలో తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జరుగనున్న పలు విశేష ఉత్సవాలు ఇలా ఉన్నాయి. మార్చి 3న‌ చంద్రగ్రహణం సందర్భంగా శ్రీ గోవింద రాజ‌స్వామి ఆల‌యం మూత‌. మార్చి 5న ఉత్తరా నక్షత్రం సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరిస్తారు. మార్చి 6, 13, 20వ‌ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఆలయ మాడవీధుల్లో శ్రీ ఆండాళ్ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. మార్చి 15న శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.మార్చి 16న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉగాది సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. మార్చి 19న ఆలయంలో ఉగాది ఆస్థానం. మార్చి 24న రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ పార్థసారధి స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు అభయమిస్తారు. మార్చి 26 నుండి ఏప్రిల్ 1వ తేదీ వ‌ర‌కు పంగుణి ఉత్తర ఉత్సవం. మార్చి 27న శ్రీరామ నవమి.