ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ స్కూల్ టీచర్లకు ముఖ్యమైన గమనిక.. అటెండెన్స్ విషయంలో కొత్త రూల్ అమల్లోకి వచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.. అటెండెన్స్ నిబంధనల్ని మరింత కఠినతరం చేసింది. ప్రతి రోజూ ఉదయం 9 గంటలలోపే టీచర్లు స్కూళ్లకు రావాలని ఆదేశించారు. ఒకవేళ టీచర్లు కనుక పాఠశాలలకు ఉదయం 9 గంటల తరువాత వస్తే ఆలస్యం (లేట్‌ ఇన్‌)గా పరిగణిస్తామని తెలిపింది. అయితే టీచర్లకు గ్రేస్ పిరియడ్ (వెసులుబాటు సమయం) 10 నిమిషాల సమయం కూడా ఉంది. కాకపోతే నెలలో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే ఉంటుంది. ఒకవేళ హాఫ్ డే లీవ్ (ఉదయం సెలవు పెట్టి మధ్యాహ్నం స్కూల్‌కు) పెట్టుకుని స్కూల్‌లకు వచ్చేవారు మధ్యాహ్నం ఒంటి గంట లోపు రావాలని సూచించారు. ఒకవేళ ఆ తర్వాత హాజరు నమోదు చేస్తే లేట్‌ఇన్‌గా పరిగణిస్తామని తెలిపారు. అదే ఉదయం స్కూల్‌కు హాజరై హాఫ్ డే లీవ్ (మధ్యాహ్నం సెలవు పెట్టినవారు) 12.30 గంటల కంటే ముందు ఔట్‌టైం పెట్టకూడదన్నారు. ముందే వెళితే త్వరగా వెళ్లిపోయినట్లుగా పరిగణిస్తారు. ప్రైమరీ స్కూల్స్‌లో (ప్రాథమిక పాఠశాలలు) టీచర్లు సాయంత్రం 3.30 గంటల కంటే ఒక నిమిషం ముందు ఔట్ టైం నమోదు చేస్తే ఏర్లీ ఔట్‌గా పరిగణిస్తారు. సబ్ ప్రైమరీ, హైస్కూల్స్ (ఉన్నత పాఠశాలల్లో) సాయంత్రం 4 గంటల కంటే ఒక్క నిమిషం ముందు ఔట్‌ టైం నమోదు చేసినా అది ఏర్లీ ఔట్‌గా పరిగణిస్తారు. టీచర్లు ఎవరైనా ఒకవేళ ఉదయం ఇన్‌టైం నమోదు చేసి.. సాయత్రం ఔట్‌ టైం నమోదు చేయకపోతే మరో రూల్ తీసుకొచ్చారు. అలాంటి టీచర్లు ఉదయం హాజరు నమోదు చేసిన వెంటనే స్కూల్ నుంచి వెళ్లిపోయినట్లుగా పరిగణిస్తారు. టీచర్లు ఈ మార్పుల్ని, కొత్త రూల్‌ను గమనించాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది.ఏపీ ప్రభుత్వ టీచర్ల అటెండెన్స్ విషయంలో పాఠశాల విద్యాశాఖ ప్రకటన సరికాదని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అభిప్రాయపడింది. టీచర్ల అటెండెన్స్ విషయంలో నిమిషం ఆలస్యమైనా గైర్హాజరుగా పరిగణిస్తామనడం సరికాదు అన్నారు. 'గతంలో అమలులో ఉన్న 10 నిమిషాల గ్రేస్‌ పీరియడ్‌ను యథాతథంగా అమలు చేయాలి. హాజరు నమోదు యాప్‌ సక్రమంగా పనిచేయని సందర్భాల్లో ఉపాధ్యాయుల్ని బాధ్యులుగా చేయడం సరికాదు. ఎంప్లాయీస్‌ ఫ్రెండ్లీ గవర్నమెంట్‌ భావనకు ఇలాంటి నిర్ణయాలు విరుద్ధం' అన్నారు. ఏపీ విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి అటెండెన్స్ విషయంలో ఏపీ పాఠశాల విద్యాశాఖ ఏ విధంగా ముందుకు వెళుతుంది అన్నది చూడాలి.