తెలంగాణలో మెడికల్ మాఫియా రెచ్చిపోతుంది. డబ్బు సంపాదనే లక్ష్యంగా చాలా మంది ఫేక్ డాక్టర్లు పుట్టుకొస్తున్నారు. కాసుల కోసం కక్కుర్తి పడుతూ ప్రజల ప్రాణాలు లెక్కచేయకుండా అర్హత లేకున్నా వైద్యం చేస్తున్నారు. తాజాగా.. నల్గొండ జిల్లాలో మహిళకు కంటి వైద్యం చేసిన ఫేక్ డాక్టర్ ఆమె చూపు పోయేందుకు కారణమయ్యాడు. మహిళ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సదరు ఫేక్ డాక్టర్‌ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. అనంతరం కంటి ఆసుపత్రులపై దాడులు నిర్వహించిన పోలీసులు.. విద్యార్హత లేకున్నా కన్సలెంట్‌ వైద్యుల పేరిట ఆస్పత్రులు నిర్వహిస్తున్న మరో నలుగురిని సైతం అదుపులోకి తీసుకున్నారు. మిర్యాలగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పజ్జూరి వికాస్ కుమార్ అనే వ్యక్తి స్థానిక డాక్టర్స్‌ కాలనీలో ఐదేళ్లుగా మహాలక్ష్మి ఐ క్లినిక్‌ను నిర్వహిస్తున్నాడు. కనీసం డిగ్రీ కూడా చదవని వికాస్.. ఓ కన్సల్టెంట్‌ డాక్టర్ పేరు, సర్టిఫికెట్‌ను చూపిస్తూ తానే డాక్టర్‌గా మారిపోయి రోగులకు వైద్యం చేస్తున్నాడు. ఈ క్రమంలో గత ఏడాది పట్టణానికి చెందిన బైరెడ్డి పద్మ మహాలక్ష్మి కంటి ఆస్పత్రికి పరీక్ష కోసం వెళ్లగా.. ఆమెకు సర్జరీ చేసి కుడి కంటిలో శుక్లాలు తొలగించాడు. అయితే సర్జరీ చేసిన తర్వాతి రోజే పద్మ కంటి చూపు మసకబారింది.. ఆ తర్వాత పూర్తిగా కంటిచూపు కోల్పోయింది. దీంతో బాధితురాలు పోలీసులకు, వైద్యశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. వికాస్ అసలు డాక్టరే కాదని గుర్తించారు. అర్హత లేకున్నా వైద్యం చేస్తున్నట్లు గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అలాగే మెడికల్‌ కౌన్సిల్‌ అధికారుల ప్రత్యేక తనిఖీలో డాక్టర్స్‌ కాలనీలోని శ్రీమహాలక్ష్మి, అన్నపూర్ణ, రఫా ఐ క్లినిక్, శాలిని, యశస్వి క్లినిక్‌లలో కన్సల్టెంట్‌ డాక్టర్ల పేరిట విద్యార్హతలేని వ్యక్తులు డాక్టర్లుగా చెలామణి అవుతున్నట్లు గుర్తించి వారి వివరాలను పోలీసులకు అందించారు. ఈ మేరకు ఆయా క్లినిక్‌లను నిర్వహిస్తున్న వల్కీ శ్రీను, బాణావత్‌ శివకోటేశ్వరరావు, వెంకటేశ్‌, గడ్డం నాగరాజులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.