Stock Market News: గత కొంత కాలంగా ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించిన స్టాక్స్‌లో ప్రముఖ బ్రోకరేజీ ప్లాట్‌ఫామ్ అయిన ఏంజెల్ వన్ లిమిటెడ్ కూడా ఉంది. స్థిరంగా రిటర్న్స్ అందిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు ఫిబ్రవరి 26న మాత్రం ఈ స్టాక్ ధర.. అంతకుముందు రోజుతో (ఫిబ్రవరి 25) పోలిస్తే ఏకంగా 90 శాతం తగ్గినట్లు చూయిస్తోంది. పలు ట్రేడింగ్ యాప్స్ సహా గూగుల్‌లో సర్చ్ చేసినా 90 శాతం వరకు పతనమైనట్లు చూయిస్తుండటంతో ఇందులో ఇన్వెస్ట్ చేసిన షేర్ హోల్డర్లు.. రెగ్యులర్‌గా స్టాక్ మార్కెట్లను అబ్జర్వ్ చేసే ట్రేడర్లు కూడా ఆందోళనకు గురవుతున్నారు. అసలేమైందో తెలియక తలలు పట్టుకుంటున్నారు. కానీ వాస్తవం ఏంటంటే.. స్టాక్ ధర పడిపోయిన మాట వాస్తవమే కానీ.. దీని వల్ల ఇన్వెస్టర్లకు పెద్దగా ఇబ్బంది ఉండదు. ఇది . >> ఏంజెల్ వన్ లిమిటెడ్ 2026, జనవరి 15న ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ఫలితాల్ని ప్రకటించింది. అదే సమయంలో ఈ కంపెనీ స్టాక్ స్ప్లిట్ ప్రకటించింది. 1:10 రేషియోలో స్టాక్ స్ప్లిట్ ప్రకటించగా.. దానికి రికార్డు తేదీ ఫిబ్రవరి 26 గా ఉంది. దీంతో ఇవాళ దానికి అనుగుణంగా ధర సర్దుబాటు అయింది. అంటే ఫిబ్రవరి 26 లోపు షేర్లు కొనుగోలు చేసిన వారికి ఈ స్టాక్ స్ప్లిట్ వర్తిస్తుంది. 1:10 రేషియో స్టాక్ స్ప్లిట్ అంటే.. షేర్ హోల్డర్ దగ్గర రూ. 10 ముఖ విలువ ఉన్న ఒక్కో ఏంజెల్ వన్ ఈక్విటీ షేరు.. రూ. 1 ఫేస్ వాల్యూ ఉన్న 10 షేర్లుగా మారుతుందన్నమాట. అంటే షేర్ హోల్డర్ల షేర్ల సంఖ్య పెరుగుతుంది. అంటే 100 షేర్లు ఉన్న వారికి 1000 షేర్లు అవుతాయి. అదే రేషియోలో దానికి అనుగుణంగా షేరు ధరను సాంకేతికంగా అడ్జస్ట్ చేస్తారు. అంతేకానీ ఇక్కడ తమ పెట్టుబడి విలువ కూడా ఏ మాత్రం మారదని తెలుసుకోవాలి. ఈ నేపథ్యంలోనే జనవరి 25న రూ. 2,489.90 వద్ద ముగియగా.. ఇవాళ స్టాక్ స్ప్లిట్ నేపథ్యంలో ఆ క్లోజింగ్ ధర రూ. 248.99 గా చూయిస్తోంది. ఇది దాదాపు 90 శాతం పతనం అన్నమాట. తర్వాత కూడా స్టాక్ మరో 2 శాతం పడిపోయి ఇంట్రాడేలో రూ. 244 వద్ద కనిష్ఠాన్ని తాకింది. స్టాక్ స్ప్లిట్ వల్ల.. షేర్ ధర తగ్గి ట్రేడర్లకు మరింత అందుబాటులోకి వస్తుందని.. తద్వారా కొనుగోళ్లు పెరుగుతాయని కంపెనీ భావిస్తుంటుంది. షేర్ల చలామణీ కూడా పెరుగుతుంది. క్యూ3 లెక్కలు చూస్తే ఏంజెల్ వన్ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 4.5 శాతం తగ్గి రూ. 269 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం 5.8 శాతం పెరిగి రూ. 1338 కోట్లకు చేరుకుంది.