హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు ప‌రిధిలోని (CURE) మూడు కార్పొరేష‌న్లకు వ‌ర్తించేలా గ్రేట‌ర్ హైద‌రాబాద్ మ‌హా న‌గ‌ర పాల‌క సంస్థ (GHMC) చ‌ట్టం స్థానంలో కోర్ అర్బన్ చ‌ట్టం రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. కోర్ అర్బన్ ప్రాంతంలో అనుమ‌తులు, రుసుమ‌లు, అభివృద్ధి ప‌నుల నిర్వహణ, ఇత‌ర వ్యవహారాలన్నింటికి ఆ చ‌ట్టమే ఆధారంగా ఉండాల‌ని సూచించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మున్సిపల్ శాఖకు సంబంధించి ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేప‌ట్టనున్న 99 రోజుల కార్యక్రమంలో మున్సిప‌ల్ ప‌రిధిలో చేప‌ట్టే ప‌నులు తొలుత చేప‌డ‌తామ‌ని ఈ సందర్భంగా సీఎం వెల్లడించారు. అదే సమయంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కోర్ అర్భన్ ఏరియాలో పారిశుద్ధ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ప‌లు ప్రాంతాల్లో చెత్త ఎక్కడ వేయాలో తెలియ‌క ప్రజలు ఖాళీ ప్రదేశాల్లో వేస్తున్నారు. ముందుగా చెత్త వేయాల్సిన ప్రాంతాల‌ను గుర్తించి అక్కడ బోర్డులు ఏర్పాటు చేయాలి. కోర్ అర్బన్ ఏరియాలో రోడ్ల నిర్మాణ విష‌యంలో నిర్దేశిత కాలం వ‌ర‌కు ఉండేలా సాంకేతిక‌త‌ను వినియోగించాలి. కోర్ అర్బన్ ఏరియాలో వీధి దీపాలు వెలుగుతున్నాయో లేదో తెలుసుకునేలా డ్యాష్ బోర్డులో క‌నిపించాలి. ఎక్కడైనా స‌మ‌స్య ఉంటే దానిని వెంట‌నే తెలుసుకొని పరిష్కరించాలి. ఫుడ్ సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. న‌గ‌రంలోని అన్ని హోటళ్లలోని కిచెన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించాలి. త‌ర‌చూ త‌నిఖీలు తప్పనిసరి చేయడమే కాకుండా, ఫుడ్ సేఫ్టీకి ఆయా హోట‌ళ్లు తీసుకుంటున్న చర్యలను మ‌దింపు చేయాలి.కోర్ అర్బన్ ఏరియాలో ఫైర్ సేఫ్టీకి ప్రధాన్యమివ్వాలి. 50 అంత‌స్తుల‌కుపైగా భ‌వనాల నిర్మాణాలు జ‌రుగుతున్నందున అగ్ని ప్రమాదాలను అరిక‌ట్టేందుకు అవ‌స‌ర‌మైన అధునాత‌న సామ‌గ్రి, సాంకేతిక‌త‌ను స‌మ‌కూర్చుకోవాలి. న‌గ‌రంలోని కూడళ్లలో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ఏర్పాటు చేసి వర్షపు నీటిని ఒడిసి పట్టాలి. కోర్ అర్బన్ ఏరియా ప‌రిధిలో ఆర్ అండ్ బీ, ఇత‌ర విభాగాల ప‌రిధిలోని రోడ్లన్నింటిని మున్సిపల్ శాఖ ప‌రిధిలోకి తీసుకురావాలి. న‌గ‌రంలో వివిధ ప్రదేశాల్లో ర‌ద్దీ త‌గ్గించేందుకు డిజైన్ చేసిన ఎలివేటెడ్ కారిడార్లు త్వరగా పూర్తి చేయాలి. చారిత్రక ప్రాధాన్యం గ‌ల కట్టడాలను ప‌ర్యాట‌క ప్రదేశాలుగా తీర్చిదిద్దేందుకు ఉన్న అవ‌కాశాల‌ను ప‌రిశీలించాల‌ని, వాటిని ప‌ర్యాట‌క స్థలాలుగా మార్చాలి. భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ ప‌రిధిలో ప్రభుత్వ కార్యాల‌యాల‌ను నిర్దేశిత స‌మ‌యంలో పూర్తి చేయాలి. అక్కడ అవ‌స‌ర‌మైన అనుమ‌తులు, వివిధ ప్రభుత్వ కార్యాల‌యాల భ‌వ‌నాల ప‌నులు వేగ‌వంతం చేయాలి. న‌గ‌రంలోని పెద్ద చెరువులు, కుంట‌ల అభివృద్ధికి అవ‌స‌ర‌మైన చర్యలు తీసుకోవాలి. హైడ్రా ప‌రిర‌క్షించిన చెరువుల చుట్టూ క‌ట్టలు క‌ట్టి వ‌దిలి వేయ‌కుండా వాటి రక్షణతో పాటు సుంద‌రీక‌ర‌ణ‌కు అవ‌స‌ర‌మైన చ‌ర్యలు తీసుకోవాలి.' అని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.