: ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ కొంత కాలంగా ఐటీ రంగాన్ని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. కొత్త కొత్త ఏఐ టూల్స్.. ఐటీ కంపెనీలకు ఇబ్బందికర పరిస్థితుల్ని సృష్టిస్తున్నాయి. చాలా వరకు మానవ ప్రమేయం తగ్గించేలా ఏఐ టూల్స్ వృద్ధి చెందుతుండటంతో ఐటీ కంపెనీ ఆదాయం తగ్గుతుందన్న భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో స్టాక్ మార్కెట్లలో . గత నెల రోజులుగా ఐటీ రంగాల షేర్లు భారీ స్థాయిలో పతనం అవుతున్నాయి. భారత స్టాక్ మార్కెట్ కూడా అదే స్థాయిలో పతనం అవుతోంది. కిందటి రోజు శుక్రవారం సెషన్‌లోనూ సూచీలు కుదేలయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ ఏకంగా 961 పాయింట్లు పడిపోగా.. నిఫ్టీ 318 పాయింట్లు పతనం అయింది. >> ఇక దేశీయ రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ స్టాక్ కూడా భారీగా పతనం అవుతోంది. శుక్రవారం రోజు ఆరంభంలో కాస్త పుంజుకున్నప్పటికీ.. చివరకు ఆ లాభాలన్ని ఆవిరైపోయాయి. చివరకు స్వల్ప లాభంతో రూ. 1298.90 వద్ద స్థిరపడింది. అయినప్పటికీ ఫిబ్రవరి నెలలో చూస్తే ఇన్ఫోసిస్ షేరు.. గత 13 సంవత్సరాల్లో అత్యంత పేలవ పనితీరు కనబరిచింది. ఫిబ్రవరి నెలలోనే చూస్తే ఇన్ఫోసిస్ షేర్ ధర 20.28 శాతం పతనమైంది. చివరిసారిగా 2013లో ఏప్రిల్ నెలలో ఇన్ఫోసిస్ షేరు 22.75 శాతం పతనం కాగా.. ఆ తర్వాత ఒక నెలలో ఈ దిగ్గజ ఐటీ స్టాక్ ఈ స్థాయిలో పతనం అవడం ఇదే తొలిసారి. దీంతో 13 ఏళ్ల రికార్డు బద్దలైంది. లార్జ్ క్యాప్ కంపెనీల విభాగంలో కూడా ఈ నెలలో అత్యధిక నష్టాన్ని ఎదుర్కొన్న కంపెనీల్లో ఇన్ఫోసిస్ కూడా ఒకటిగా ఉంది. ఇన్ఫోసిస్ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 1775.85 గా ఉండగా.. అక్కడి నుంచి చూసినా స్టాక్ ఏకంగా 27 శాతం పతనమైంది. ఇన్ఫోసిస్ స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ. 1264.10 గా ఉంది. కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 5.39 లక్షల కోట్లుగా ఉంది. గత 5 రోజుల్లో 3 శాతానికిపైగా షేర్ ధర పడిపోగా.. 6 నెలల్లో 14 శాతం తగ్గింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు కూడా 20 శాతం పడిపోయింది. ఏడాది వ్యవధిలో 23 శాతం కుదేలైంది. మ్యూచువల్ ఫండ్ కంపెనీలు కూడా ఎక్కువగా ఇన్ఫోసిస్ షేరును తమ పోర్ట్‌ఫోలియోలో చేర్చుకుంటుంటాయి. కానీ ఇటీవల స్టాక్ భారీ పతనంతో.. మ్యూచువల్ ఫండ్ సంస్థలకు ఆ సెగ తాకింది. వేల కోట్ల నష్టం వాటిల్లుతోంది.