సూపర్-8లో టీమిండియా బోణీ కొట్టింది. గురువారం చెన్నైలోని ఎంఏ చిదంబరం క్రికెట్ స్టేడియంలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగులు స్కోరు చేసింది. అనంతరం జింబాబ్వేను 184/6 పరుగులకే పరిమితం చేసింది. ఈ ఫలితంతో సెమీస్ అవకాశాలను మెరుగుపర్చుకుంది.257 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే.. ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. కానీ ఆ జట్టు ఓపెనర్ బెన్నెట్ మాత్రం చివరి వరకూ పోరాడాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. అతడు మాత్రం నిలబడ్డాడు. చివరకు 59 బంతుల్లో 97 రన్స్ చేసి.. నాటౌట్‌గా నిలిచాడు. అయితే అతడి పోరాటం ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది. చివరకు నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. 72 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.సూపర్-8లో వరుసగా రెండో మ్యాచులో ఓడిపోయిన జింబాబ్వే.. టోర్నీ సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. లీగ్ స్టేజ్‌లో ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి.. తదుపరి రౌండ్‌కు అర్హత సాధించిన జింబాబ్వే.. సూపర్-8లో మాత్రం తేలిపోయింది. వెస్టిండీస్, భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే.. టోర్నీ సెమీఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. భారీ స్కోరు చేసింది. అభిషేక్ శర్మ (55), హార్దిక్ పాండ్యా (50). తిలక్ వర్మ (44), ఇషాన్ కిషన్ (38) మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. దీంతో టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో తమ అత్యధిక స్కోరు రికార్డు బ్రేక్ చేసింది. 2007 టీ20 ప్రపంచకప్‌లో భారత్.. ఇంగ్లాండ్‌పై 218/4 స్కోరు చేసింది. ఆ మ్యాచులో యువరాజ్ సింగ్.. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టాడు.తాజా విజయంతో భారత్.. సెమీఫైనల్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. మార్చి 1న వెస్టిండీస్‌తో జరిగే మ్యాచులో టీమిండియా విజయం సాధిస్తే.. నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.