Block: అమెరికాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్ బ్లాక్ సంస్థ షాకింగ్ ప్రకటన చేసింది. ఏకంగా 4 వేల మందికిపైగా ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు వెల్లడించింది. ఇది తమ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు సగం వరకు ఉండటం గమనార్హం. కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 10 వేలకుపైగా ఉండగా.. ఇప్పుడు 4 వేల మందిని తొలగిస్తే ఆ సంఖ్య 6 వేల లోపునకు చేరనుందని CNBC రిపోర్ట్ చేసింది. గతంలో ట్విట్టర్ సీఈఓగా పని చేసిన జాక్ డోర్సీనే ఈ కంపెనీకి ఫౌండర్, సీఈఓగా ఉన్నారు. దీంతో లేఆఫ్స్ నేపథ్యంలో షేర్ హోల్డర్లకు జాక్ డోర్సే ఒక లేఖ రాశారు. తమ కంపెనీ తీసుకున్న అత్యంత కఠిన నిర్ణయాల్లో ఇదొకటని చెప్పారు. >> ఈ లేఆఫ్స్‌లో వేలాది మంది ఉద్యోగులు నిష్క్రమిస్తారని లేదా సంప్రదింపుల ప్రక్రియలోకి వస్తారని చెప్పారు జాక్ డోర్సే. సంస్థ దీర్ఘకాలిక వృద్ధి ప్రయోజనాల కోసం ఈ లేఆఫ్స్ తప్పట్లేదని.. కంపెనీ మరో అడుగు ముందుకు వేయాల్సిన సమయం వచ్చేసిందని చెప్పారు బ్లాక్ సీఎఫ్ఓ అమృతా అహుజా. చిన్న టీమ్స్‌తో.. మరిన్ని ఏఐ టూల్స్‌తో ఆటోమేటిక్ వర్క్‌పై సంస్థ దృష్టి సారించినట్లు చెప్పుకొచ్చారు. సంస్థలో దాదాపు సగం మంది వరకు ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించడంతో గత దశాబ్ద కాలంలోనే టెక్ రంగంలో జరిగిన అతిపెద్ద ఉద్యోగాల కోతలో ఇదొకటిగా నిలిచింది. సాధారణంగా ఏదైనా కంపెనీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఉద్యోగుల్ని తొలగిస్తాయి కానీ బ్లాక్ సంస్థ లాభాల్లో ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించడం చర్చనీయాంశమైంది. 'మనుషుల కంటే ఇప్పుడు ఏఐ టూల్స్ మరింత వేగంగా, సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. కాబట్టి.. చిన్న బృందాలతోనే మెరుగైన ఫలితాలు సాధించడమే ప్రస్తుతం మా లక్ష్యం" అని డోర్సే వివరించారు.బాధిత ఉద్యోగులకు కంపెనీ అండగానే ఉంటుందని జాక్ డోర్సే భరోసా ఇచ్చారు. వారికి 20 వారాల పూర్తి జీతంతో పాటు.. కంపెనీలో పని చేసిన ప్రతి ఏడాదికి అదనంగా వారం చొప్పున జీతం ఇస్తామని చెప్పారు. ఇంకా 6 నెలల పాటు హెల్త్ కేర్, కార్పొరేట్ డివైజ్‌లు, ఇంకా ఇతర ఖర్చుల కోసం 5 వేల డాలర్ల వరకు ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే లేఆఫ్స్ ప్రకటన తర్వాత భారీగా దూసుకెళ్లింది. సాధారణ ట్రేడింగ్‌లో 5 శాతం పెరిగి 54.53 డాలర్ల వద్ద స్థిరపడగా.. ఎక్స్‌టెండెడ్‌ ట్రేడింగ్‌లో (ఆఫ్టర్ అవర్స్ ట్రేడింగ్) మరో 23 శాతం దూసుకెళ్లి 67.36 డాలర్ల వద్ద చూయిస్తోంది. ఇలా ఓవరాల్‌గా 30 శాతం వరకు పెరగడం విశేషం.