‘పవర్’ఫుల్ డిపార్ట్‌మెంట్.. తెలంగాణలో వీరి జీతాలే ఎక్కువ.. గరిష్టంగా నెలకు రూ.7 లక్షల శాలరీ!

Wait 5 sec.

కొత్తగా ఉద్యోగంలో చేరిన ఐఏఎస్ అధికారి కంటే స్వీపర్ జీతం ఎక్కువగా ఉంది. చిన్నదైనా పెద్దదైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కొందరు ఎందుకు అంటుంటారో ఈ అంకెలు చెప్పకనే చెబుతున్నాయి. నెలకు లక్షల రూపాయల జీతం పొందే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు సైతం.. 45 ఏళ్లు దాటితే జాబ్ ఉంటుందో ఉండదో అని భయపడే పరిస్థితి. కానీ ప్రభుత్వ ఉద్యోగాల్లో మాత్రం జాబ్ పోతుందనే భయం ఉండదు. అందుకే డిగ్రీలు, పీజీలు, ఆఖరికి పీహెచ్‌డీలు చేసిన వారు కూడా క్లర్క్, ఫ్యూన్, స్వీపర్, డ్రైవర్ లాంటి చిన్న ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా ఎందుకు ప్రయత్నిస్తుంటారు.శాఖల పరంగా చూస్తే తెలంగాణలో అత్యధిక జీతం పొందుతున్న వారిలో విద్యుత్ శాఖలోని సీనియర్ ఉద్యోగులు ముందు వరుసలో ఉన్నారు. టీజీ జెన్కో, టీజీ ట్రాన్స్‌కో, తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ లాంటి సంస్థల్లో చీఫ్ ఇంజినీర్లుగా పని చేస్తున్నవారు భారీ వేతనాలు పొందుతున్నారు. ప్రతి నాలుగేళ్లకోసారి క్రమం తప్పకుండా వేతన సవరణ ఉంటుండటంతో.. వీరి నెల జీతం గరిష్టంగా రూ.7 లక్షల మార్క్‌కు చేరుకుంది. తెలంగాణ జెన్కోలో పని చేస్తున్న సీనియర్ అధికారి వేతనానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. దాని ప్రకారం.. తెలంగాణ జెన్కోలో చీఫ్ ఇంజినీర్లుగా పని చేస్తున్న వారికి నెలకు రూ.4.5 లక్షల జీతం వస్తోంది. కాగా ఇతర ఇంజినీరింగ్ విభాగాల్లో వేతనం రూ.3 లక్షలుగా ఉంది. ఎంట్రీ లెవల్ ఇంజినీర్లకు నెలకు రూ.65 వేలు జీతం వస్తోంది. డీఏ, ఇంక్రిమెంట్లు కలిపితే వీరి జీతం నెలకు రూ. 90ల నుంచి లక్ష రూపాయల వరకు ఉండే అవకాశం ఉంది. టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న క్లాస్ త్రి ఉద్యోగులు నెలకు లక్ష రూపాయల వరకు వేతనం పొందుతున్నారు. సీనియర్ సిబ్బంది అలవెన్సులు కలుపుకొని నెలకు రూ. 4 లక్షల వరకు వేతనం పొందుతున్నారు. అయితే నాలుగో తరగతి ఉద్యోగుల సగటు వయసు 50 ఏళ్లుగా ఉంది. ఇటీవలి కాలంలో రిక్రూట్‌మెంట్లు పెద్దగా లేకపోవడమే దీనికి కారణం. పీఆర్సీల కారణంగా తెలంగాణలోని విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న స్వీపర్ల జీతాలు కూడా భారీగా పెరిగాయి.తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు గత 12 ఏళ్లలో భారీగా పెరిగాయి. దీంతో ప్రభుత్వ ఖజానాపై భారం కూడా అదే స్థాయిలో పెరిగింది. రాష్ట్రం ఏర్పాటైనప్పుడు 2014లో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం నెలకు రూ.1400 కోట్లు ఖర్చు చేయగా.. ఇప్పుడు అది నెలకు రూ.6 వేల కోట్లకు పెరిగింది.తెలంగాణ రెవెన్యూలో 45 శాతం జీతాలు, పెన్షన్లు, అప్పులకు వడ్డీలు చెల్లించడానికే సరిపోతోందని 2023-24 నాటి కాగ్ రిపోర్టు వెల్లడించింది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వేగంగా పెరుగుతుండటం, జీఎస్‌డీపీ 10 శాతానికిపైగా ఉండటం, తలసరి ఆదాయం దేశంలోకెల్లా ఎక్కువగా ఉండటం వల్ల ఉద్యోగుల జీతాలు, సంక్షేమ పథకాలు కోసం ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేయగలుగుతోంది.