వచ్చిపోయే అతిథులు, బంధువులతో కోలాహలంగా ఉన్న కళ్యాణ మండపంలో ఒక్కసారిగా అలజడి రేగింది. వధువుపై ఓ యువకుడు తుపాకితో కాల్పులు జరపడంతో మండపంలోని ఉన్నవారు భయంతో పరుగులు తీశారు. సినిమాను తలపించే ఈ ఘటన బిహార్‌లోని బక్సార్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వధువుపై కాల్పుల జరిపిన నిందితుడ్ని ఆమెను ప్రేమిస్తున్న యువకుడిగా భావిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బక్సార్బక్సార్ జిల్లా చౌసా నగర్ పంచాయతీలోని మల్లా తోలాకు చెందిన నందజీ మల్లా కుమార్తె ఆర్తి కుమారికి (18) ఉత్తర్ ప్రదేశ్‌లోని బల్లియాకు చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. ఫిబ్రవరి 24న పెళ్లికి ముహూర్తం నిర్ణయించగా.. వధువు ఇంటికి వరుడు ఊరేగింపుగా చేరుకున్నాడు. మంగళవారం రాత్రి వేదికపై వధూవరులు దండలు మార్చుకునే కార్యక్రమం జరుగుతోంది. ఆర్తి సోదరి వరుడి నుదుటిపై తిలకం దిద్దతోంది. తర్వాత ఆమె తన సోదరివైపు తిరుగుతుండగా.. ముఖానికి మాస్క్ వేసుకున్న యువకుడు హఠాత్తుగా వేదిక ముందుకు వచ్చి తుపాకితో ఆర్తిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో వధువు పొట్టలోకి బుల్లెట్ దూసుకెళ్లింది.గాయపడిన ఆర్తిని చికిత్స కోసం స్థానిక సాదర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వారణాసి ట్రూమా సెంటర్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటన మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో చోటుచేసుకుంది. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాల్పులు జరిపిన తర్వాత పరారైన నిందితుడి కోసం గాలిస్తున్నారు. యువకుడ్ని ఆర్తి పొరుగింటిలో ఉండే దీనబంధుగా గుర్తించారు. అతడే తనపై కాల్పులు జరిపినట్టు వధువు కుటుంబసభ్యులకు తెలిపింది. ప్రేమ పేరుతో తమ కుమార్తెను దీనబంధు వేధించాడని కుటుంబం ఆరోపించింది. ఆర్తి అంగీకరించకపోయినా రెండేళ్లుగా ప్రేమించాలని వెంటబడుతున్నాడని స్థానికులు తెలిపారు. గతంలో ఆమెకు కుదిరిన సంబంధాన్ని చెడగొట్టాడని, అబ్బాయి కుటుంబాన్ని బెదిరించడంతో వాళ్లు పెళ్లిని రద్దుచేసుకున్నారని చెప్పారు. అయితే, నిందితుడు తండ్రి రామశంకర్ చౌధురి మాత్రం కుమారుడి ప్రేమ విషయం తనకు తెలియదని చెప్పడం గమనార్హం. ఈ ఘటనతో వ్యక్తిగత వివాదాలు ముడిపడిన ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో దీనబంధు లిక్కర్ కేసులో అరెస్ట్‌ అయి జైలుకెళ్లి బెయిల్‌పై విడుదలయ్యాడు.