Income Tax: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ముఖ్యంగా జీతం పొందే ఉద్యోగులకు ఇదొక హెచ్చరిక లాంటి వార్త. మనం పన్ను కట్టేసాం కదా అని సరిపెట్టుకుంటే సరిపోదు అది సరైన విభాగం కింద చూపిస్తున్నామా లేదా అనేది కూడా అంతే ముఖ్యం. తాజాగా ఒక ఉద్యోగి తన ఆదాయాన్ని తప్పుగా పేర్కొనడం వల్ల ఆదాయపు పన్ను శాఖ ఏకంగా 200 శాతం జరిమానా విధించింది. ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ సంచలన తీర్పు ఇచ్చింది. అసలు ఆ కేసు ఏంటి? ఆ భారీ జరిమానా నుంచి ఆ ఉద్యోగి ఎలా బయటపడ్డారో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.ఈ కేసులో ఒక ఉద్యోగి తన ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసేటప్పుడు ఒక పెద్ద పొరపాటు చేశారు. ఆయన తనకు వచ్చిన ఆదాయాన్ని జీతం కింద చూపించకుండా ఇతర వనరుల నుంచి ఆదాయంగా పేర్కొన్నారు. దీనివల్ల పన్ను చెల్లింపులో వ్యత్యాసం రాకపోయినప్పటికీ, ఆదాయపు పన్ను శాఖ దీనిని ఆదాయ వివరాలను దాచిపెట్టడంగా పరిగణించింది. ఈ కారణంతో ఐటీ శాఖ ఆ ఉద్యోగిపై సెక్షన్ 271(1)(c) కింద విచారణ చేపట్టి చెల్లించాల్సిన పన్నుపై ఏకంగా విధించింది. తాను పన్ను మొత్తాన్ని సకాలంలోనే కట్టానని ఆ ఉద్యోగి వాదించినప్పటికీ, శాఖ అధికారులు మాత్రం అంగీకరించలేదు.. ఈ కేసును విచారించిన ముంబై బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగి తన ఆదాయాన్ని తప్పుగా వర్గీకరించిన మాట వాస్తవమే అయినా, ఆయన ఆదాయాన్ని పూర్తిగా వెల్లడించారని, దానికి తగిన పన్నును కూడా ప్రభుత్వానికి చెల్లించారని ట్రిబ్యునల్ గుర్తించింది. కేవలం ఒక విభాగంలో చూపించాల్సిన ఆదాయాన్ని మరో విభాగంలో చూపించడం అనేది సాంకేతిక పొరపాటే తప్ప, అది కావాలని ఆదాయాన్ని దాచిపెట్టినట్లు కాదని స్పష్టం చేసింది. ఆదాయ వివరాలను దాచిపెట్టడం లేదా తప్పుడు వివరాలు ఇవ్వడం వంటివి జరిగితేనే పెనాల్టీ వేయాలని, ఈ కేసులో అటువంటి ఉద్దేశం కనిపించడం లేదని పేర్కొంటూ ఐటీ శాఖ విధించిన 200 శాతం జరిమానాను ఐటీఏటీ కొట్టివేసింది.ఈ తీర్పు ఉద్యోగులకు ఊరటనిచ్చినప్పటికీ ఐటీ రిటర్నుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ కేసు నిరూపించింది. మీ ఫారం 16 ప్రకారం ఉన్న జీతపు ఆదాయాన్ని కచ్చితంగా హెడ్ కిందనే చూపించాలి. సెక్షన్ 80C లేదా ఇతర మినహాయింపులను క్లెయిమ్ చేసేటప్పుడు తప్పుడు లెక్కలు చూపకూడదు. సేవింగ్స్ అకౌంట్ లేదా ఎఫ్డీల ద్వారా వచ్చే వడ్డీని ఇతర ఆదాయం కింద చూపించడం మర్చిపోవద్దు.ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేటప్పుడు చేసే చిన్న తప్పు కూడా మనల్ని కోర్టుల చుట్టూ తిరిగేలా చేస్తుంది. ఐటీఏటీ తీర్పుతో ఈ కేసులో ఉద్యోగికి న్యాయం జరిగినప్పటికీ, ప్రతిసారీ ఇలాగే జరుగుతుందని చెప్పలేం. అందుకే, ట్యాక్స్ కట్టడమే కాదు, దాన్ని సరైన పద్ధతిలో రిపోర్ట్ చేయడం కూడా అంతే ముఖ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.