ముందుంది ముసళ్ల పండుగ.. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు ఊరటపై బీజేపీ చీఫ్ వ్యాఖ్యలు

Wait 5 sec.

ఢిల్లీ లిక్కర్ కేసును కొట్టివేస్తూ.. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టెక్నికల్ కారణాల వల్ల ఈ మద్యం కేసును ఢిల్లీ కోర్టు కొట్టివేసిందని పేర్కొన్నారు. అంత మాత్రం చేత ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహా ఇతర నిందితులుగా ఉన్న వారు.. తప్పు చేయలేదని అర్థం కాదని వెల్లడించారు. ఈ కేసును కోర్టు డిశ్చార్జ్ చేసినంత మాత్రాన వారు నిర్దోషులు అయిపోరు అని తెలిపారు. ఒకవేళ వారు అలా భావిస్తే.. ఇది వారి అమాయకత్వమే అవుతుందని విమర్శలు గుప్పించారు.ఇక ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి.. తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై సీబీఐ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుందని రామచందర్ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు. రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ.. పై కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. ప్రస్తుత తీర్పు కేవలం ట్రయల్ కోర్టు నుంచి వచ్చింది మాత్రమేనని.. పైకోర్టుకు వెళ్తే తీర్పు మారే అవకాశం ఉందని స్పష్టం చేశారు.మరోవైపు.. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి కవితకు రామచందర్ రావు.. సూటి ప్రశ్నలు వేశారు. వాళ్లు ఏ తప్పు చేయనపుడు సెల్‌ఫోన్, సిమ్ కార్డును ఎందుకు కాల్చేశారని నిలదీశారు. అటు.. అరవింద్ కేజ్రీవాల్ మద్యం పాలసీని మార్చుకోవాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు. అయితే.. విచారణతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని ఈ సందర్భంగా రాంచందర్ రావు స్పష్టం చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీపై మొట్టమొదట సవాల్ చేసిందే కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. 2022లోనే కాంగ్రెస్ పార్టీ.. ఢిల్లీ మద్యం పాలసీపై ఆరోపణలు చేసినట్లు తెలిపారు. ఆ తర్వాత 2024లో ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి సీబీఐ, ఈడీలు రంగ ప్రవేశం చేసినట్లు చెప్పారు.అదే సమయంలో ఢిల్లీ లిక్కర్ కేసును కోర్టు కొట్టివేయడం వెనక ఉన్న అసలు కారణాన్ని కూడా రాంచందర్ రావు బయటపెట్టారు. దర్యాప్తు అధికారులు అడిగిన పత్రాలను నిందితులు ఇవ్వలేదని అనుమానం వ్యక్తం చేశారు. అందుకే కోర్టు అడిగిన సమాచారాన్ని సీబీఐ సమర్పించలేకపోయిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే.. ఈ తీర్పుతో ఎవరూ చంకలు గుద్దుకోవాల్సిన అవసరం లేదని.. వారికి ముందుంది ముసళ్ల పండగ అంటూ రాంచందర్ రావు తీవ్ర హెచ్చరికలు చేశారు.