మాజీ మావోయిస్ట్‌లతో రేవంత్ రెడ్డి భేటీ.. తెలంగాణ ప్రభుత్వ పాలన బాగుందని ప్రశంసలు

Wait 5 sec.

మార్చి 31వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా మావోయిస్టులను లేకుండా చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం చేపట్టి.. అడవుల్లోని మావోయిస్ట్‌లను ఏరివేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాలు కూడా నక్సల్స్‌ను లొంగిపోవాలని సూచిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల చాలా మంది మావోయిస్ట్‌లు.. తెలంగాణ ప్రభుత్వం ముందు లొంగిపోయారు. ఇందులో మావోయిస్ట్ పార్టీ మాజీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ , నూనె నరసింహారెడ్డి, మల్లా రాజిరెడ్డి, సుజాతక్క, దామోదర్‌, చంద్రన్నలు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయిన మావోయిస్టులతో తాజాగా సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. దాదాపు గంటన్నరకు పైగా సుదీర్ఘంగా వారితో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి.. కీలక అంశాలు చర్చించారు. రాజకీయ ఎజెండాపైన వివిధ రకాలుగా మాజీ మావోయిస్ట్‌లు చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు కే కేశవరావు, వేం నరేందర్ రెడ్డి.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఏడీజీ విజయ్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఐజీ సుమతి హాజరయ్యారు. ఇక ఈ సమావేశం ప్రారంభం కావడానికి ముందు మీడియాతో మాట్లాడిన దేవ్‌జీ.. సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి, ఐజీ సుమతిలకు థ్యాంక్స్ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సరెండర్ పాలన బాగుందని ప్రశంసలు గుప్పించారు. అయితే లొంగిపోయిన మావోయిస్టులకు ఇచ్చే రివార్డ్ పాలసీని రూ.కోటికి పెంచాలని కోరినట్లు తెలిపారు. అంతేకాకుండా 5 ఎకరాల స్థలం కూడా ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. కానీ 5 ఎకరాలు ఇవ్వడం సాధ్యం కాదని ప్రభుత్వం చెప్పినట్లు పేర్కొన్నారు. అదే సమయంలో లొంగిపోయిన వారికి.. ఇల్లు, ఉద్యోగం, జీవనభృతిపై సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని దేవ్‌జీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే.. జైళ్లలో ఉన్న మావోయిస్టులను కలుస్తామని.. ఆ తర్వాత లొంగుబాట్లపై అందరం కలిసి తెలంగాణ ప్రజలకు బహిరంగ లేఖ రాస్తామని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తుపాకీ సిద్ధాంతం సరైన దారి కాదని ప్రజలకు వివరిస్తామని చెప్పారు. మాజీ మావోయిస్ట్ నేతలతో సమావేశం అయిన తర్వాత మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. నక్సల్స్ జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత చట్ట పరిధిలో వారు ఏ పనైనా చేసుకోవచ్చని వెల్లడించారు. కానీ రూల్స్ ఉల్లంఘిస్తే మాత్రం.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. నక్సల్స్ లొంగుబాట్లపై అసెంబ్లీలో ప్రకటన చేయనున్నట్లు తెలిపారు.